భారత షూటర్ల జోరు

ABN , First Publish Date - 2021-03-22T06:13:14+05:30 IST

ప్రపంచ కప్‌ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్య పతకాలతో అదరగొట్టారు. మహిళల స్కీట్‌లో గనెమత్‌ సెఖాన్‌ సీనియర్‌ స్థాయిలో...

భారత షూటర్ల జోరు

  • రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం
  • వరల్డ్‌ కప్‌  

న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్య పతకాలతో అదరగొట్టారు. మహిళల స్కీట్‌లో గనెమత్‌ సెఖాన్‌ సీనియర్‌ స్థాయిలో తొలిసారి ప్రపంచ కప్‌ పతకం అందుకున్నది. ఈ విభాగంలో ఆమె కాంస్యం దక్కించుకున్నది. ఇక 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో పురుషులు, మహిళల జట్లు బంగారు పతకాలతో మెరిశాయి. యశస్వినీ సింగ్‌ దేశ్వాల్‌, మనూ భాకర్‌, శ్రీ నివేతతో కూడిన భారత జట్టు మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో వారు 16-8 స్కోరుతో పోలెండ్‌ను చిత్తు చేశారు. అలాగే సౌరభ్‌ చౌధురి, అభిషేక్‌ వర్మ, షహజార్‌ రిజ్వీ త్రయం పురుషుల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో పసిడి పతకం కైవసం చేసుకున్నది. ఫైనల్లో వారు 17-11 స్కోరుతో వియత్నాంను ఓడించారు. కాగా..ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌, దీపక్‌ కుమార్‌, పంక్‌ కుమార్‌తో కూడిన భారత జట్టు పురుషుల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం గెలుపొందింది. అమెరికా జట్టు పసిడి పతకం నెగ్గింది. అపూర్వ చండీలా, నిషా కన్వర్‌, శ్రియాంక షాదంగితో కూడిన భారత మహిళల జట్టు ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. 


మరో ఇద్దరికి కొవిడ్‌: ప్రపంచ కప్‌లో క్రమంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం మరో ఇద్దరు భారత షూటర్లు పాజిటివ్‌గా తేలారు. దాంతో ఈ టోర్నీలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య ఆరుకు చేరింది. శనివారం ఇద్దరు భారత షూటర్లకు వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-03-22T06:13:14+05:30 IST