Abn logo
Sep 25 2021 @ 03:10AM

‘‘భారతీయులను కాల్చి చంపుతా’’

చైనా కంపెనీ ఉన్మాదం.. చిన్నారుల దుస్తులపై ద్వేషపూరిత రాతలు


 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 : చైనాకు చెందిన ప్రముఖ వస్త్ర తయారీ కంపెనీ ‘జేఎన్‌బీఐ’ భారత్‌పై విషం కక్కింది. భారతీయులపై చైనా బాలల మనసులో విద్వేష బీజాలు నాటేలా అసభ్య వ్యాఖ్యలతో కూడిన పలు చిత్రాలను చిన్న పిల్లల దుస్తులపై ముద్రించింది. ‘‘అంతటా భారతీయులు నిండిపోయారు. నేను ఈ తుపాకీ తీసుకొని వాళ్లను ముక్కలు ముక్కలు చేస్తాను’’ అని రాసి ఉన్న ఒక షర్ట్‌ ఫొటో చైనా సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ‘వీబో’ వేదికగా బట్టబయలైంది. మరో పిల్లల షర్టుపై ‘నరకంలోకి స్వాగతం.. నిన్ను తాకనివ్వు’ అనే కామెంట్‌ను ముద్రించారు. ఈ రెండు ఫొటోలు వైరల్‌ కావడంతో చైనా నెటిజెన్లు జేఎన్‌బీఐ కంపెనీపై ఆగ్రహం వెళ్లగక్కారు. పిల్లల లేత మనసుల్లో విష బీజాలు నాటుతారా అని మండిపడ్డారు. దీంతో దిగొచ్చిన జేఎన్‌బీఐ కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఆ షర్టుల స్టాక్‌ను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. షర్టులపై సృజనాత్మక చిత్రాలను ముద్రించాలనే ప్రయత్నంలో ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. మరోసారి ఈవిధంగా జరగకుండా చూసుకుంటామని పేర్కొంది.