‘కీవ్‌’ నుంచి సరిహద్దులకు క్షేమంగా భారతీయులు.. ఇండియన్ ఎంబసీకి తాళం!

ABN , First Publish Date - 2022-03-02T13:57:07+05:30 IST

యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు ఆ నగరం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్టు విదేశీవ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు.

‘కీవ్‌’ నుంచి సరిహద్దులకు క్షేమంగా భారతీయులు.. ఇండియన్ ఎంబసీకి తాళం!

వచ్చే 3 రోజుల్లో స్వదేశానికి తరలిస్తాం: కేంద్రం

రంగంలోకి భారత వాయుసేన

న్యూఢిల్లీ/ముంబై, మార్చి 1: యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు ఆ నగరం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్టు విదేశీవ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖర్కీవ్‌, కీవ్‌ సహా ఇతర ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులు, పౌరులను క్షేమంగా తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి తరలించాలని దౌత్యకార్యాలయ అధికారులను కోరినట్టు చెప్పారు.


రాబోయే మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా వీరిని స్వదేశానికి తరలించనున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, మంగళవారం ఉదయం కీవ్‌ నగరాన్ని తక్షణమే విడిచిపెట్టాలని అక్కడి విద్యార్థులకు భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ అంచనాల మేరకు 16 వేల మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికీ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి ఉన్నారు. వీరిలో కొందరు బంకర్లలో తలదాచుకోగా, మరికొందరు మెట్రో స్టేషన్లలో, బాంబు షెల్టర్లలో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక.. స్వదేశానికి తిరిగి వచ్చే విద్యార్థులు పాస్‌పోర్టు సహా అవసరమైన నగదు, చలిని తట్టుకునే దుస్తులు వెంట ఉంచుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.


భారత దౌత్యకార్యాలయానికి తాళం

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయాన్ని మూసివేశారు. ఈ నగరంలో భారతీయులెవరూ లేరని నిర్ధారించుకున్నాక దౌత్యకార్యాలయానికి తాళం వేశారు. బుధవారం నుంచి రష్యా ఈ నగరంపై బాంబుదాడులు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక భారతీయుల తరలింపు విషయమై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా.. విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు వాయుసేన రంగంలోకి దిగనుంది. ప్రధాని ఆదేశాలతో.. సీ-17 ఎయిర్‌క్రా్‌ఫ్టలు ఇందుకోసం దూసుకుపోనున్నాయి. బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు ఇవి రొమేనియాకు బయలుదేరనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


కాగా.. మరో 182 మంది భారతీయులు ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో అత్యధికులు విద్యార్థులే. విమానాశ్రయంలో వారికి కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే స్వాగతం పలికారు. ఇక.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో మరో 17 మంది మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో బుకారెస్టు నుంచి తెలంగాణకు చెందిన 11 మంది విద్యార్థులు, ఏపీకి చెందిన ఆరుగురు విద్యార్థులు వచ్చారు. వారిని ఏపీ, తెలంగాణ భవన్‌ల అధికారులు రిసీవ్‌ చేసుకొని స్వస్థలాలకు పంపించారు.


ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు

ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం స్లోవేకియాకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చేందుకు మంగళవారం స్లోవేకియాకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు కూడా వెళ్లారు. మరో కేంద్ర మంత్రి హర్దీ్‌పసింగ్‌పూరి హంగరి రాజధాని బుడాపె్‌స్టకు వెళ్లారు.

Updated Date - 2022-03-02T13:57:07+05:30 IST