జో బైడెన్ కోసం ఒక్క రాత్రిలో రూ. 25 కోట్లు సేకరించిన ఇండియన్ అమెరికన్స్

ABN , First Publish Date - 2020-09-24T09:24:10+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ క్యాంపెయిన్ కోసం

జో బైడెన్ కోసం ఒక్క రాత్రిలో రూ. 25 కోట్లు సేకరించిన ఇండియన్ అమెరికన్స్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ క్యాంపెయిన్ కోసం ఇండియన్ అమెరికన్స్ ఒక్కరాత్రిలో 33 లక్షల డాలర్లను(రూ. 24 కోట్ల 34 లక్షలు) సేకరించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన ఫండ్‌రైజర్ కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్లు పాల్గొని ఇంతటి భారీ స్థాయిలో నిధులను సేకరించారు. ఇప్పటివరకు ఒక్కరాత్రిలో ఇంత మొత్తం సేకరించడం ఇదే రికార్డు అని బైడెన్-హ్యారిస్ నేషనల్ ఫైనాన్స్ కమిటీ 2020 మెంబర్ రమేష్ కపూర్ తెలిపారు. ఇక ఈ వర్చువల్ ఫండ్‌రైజర్ కార్యక్రమంలో జో బైడెన్ కూడా పాల్గొని ఇండియన్ అమెరికన్లతో సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్ష పదవి రేసులో ఉండటం వల్లే ఇంత భారీ మొత్తంలో నిధులు ఫండ్ రైజర్ ద్వారా వచ్చాయని జో బైడెన్ అన్నారు. 


ఇక ఈ కార్యక్రమంలో నిధులను సేకరించడమే కాకుండా.. ఇండియన్ అమెరికన్స్ జో బైడెన్‌ను కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. జో బైడెన్ క్యాంపెయిన్ ప్లాట్‌ఫామ్ అయిన ‘జో విజన్’లో హిందువులకు ప్రత్యేక సెక్షన్ లేకపోవడంపై భారతీయులు అభ్యంతరం చెప్పారు. ఇండియన్ అమెరికన్లు, ముస్లింలు, కాథలిక్ క్రిస్టియన్లు.. ఇలా అందరికి సెక్లన్లు పెట్టి తమకు పెట్టకపోవడంపై భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముస్లిం అమెరికన్లు అనే సెక్షన్‌లో జో బైడెన్ కశ్మీర్, సీఏఏ అంశాలపై మాట్లాడిన తీరును భారతీయులు తప్పు పట్టారు. జో బైడెన్ ముస్లిం సెక్షన్‌లో ‘కశ్మీర్‌ ప్రజల హక్కులను పునరుద్దించడానికి భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. శాంతియుత నిరసనలను నివారించడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం వంటివి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి’ అని ముస్లింలకు అనుకూలంగా చెప్పుకొచ్చారు. 


అంతేకాకుండా అస్సోంలో భారత ప్రభుత్వం అమలు చేసిన ఎన్‌ఆర్‌సీ పట్ల, సీఏఏను చట్టంగా ఆమోదించడం పట్ల జో బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ చర్యలు భారతదేశంలోని దీర్ఘకాల లౌకికవాద సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాయన్నారు. జో బైడెన్ ఈ విధంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఇండియన్ అమెరికన్స్ నిరాశ వ్యక్తం చేశారు. జో బైడెన్ వేరే దేశంపై ఈ విధంగా కామెంట్లు చేయడం తగదని అన్నారు. కశ్మీర్, సీఏఏలపై చేసిన వ్యాఖ్యలపై పునసమీక్ష చేసుకోవాలని ఇండియన్ అమెరికన్స్ జో బైడెన్‌ను కోరారు. 

Updated Date - 2020-09-24T09:24:10+05:30 IST