ఇండియాకు తీసుకెళ్లండి ప్లీజ్.. అని వేడుకుంటున్న ఎన్నారైలు!

ABN , First Publish Date - 2020-05-29T22:31:16+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఆఫ్రికాలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం తమను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని వే

ఇండియాకు తీసుకెళ్లండి ప్లీజ్.. అని వేడుకుంటున్న ఎన్నారైలు!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా ఆఫ్రికాలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం తమను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. భారత ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా 45వేల మంది భారతీయులు ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారు.


ఈ నేపథ్యంలో ఆఫ్రికాలో చిక్కుకున్న భారతీయులు.. తమను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గుజరాత్‌కు చెందిన బ్రిజేష్ మిస్త్రీ.. వర్క్ వీసాపై గత రెండు సంవత్సరాలుగా నార్త్ ఆఫ్రికాలోని మొరాకోలోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. మార్చిలో బ్రిజేష్ మిస్త్రీ భార్య, కూతురు.. ఆయనను చూడటానికి మొరాకో వెళ్లారు. వీరంతా కలిసి ఏప్రిల్ 30న ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ భారత్‌లో విజృంభించడంతో.. భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో బ్రిజేష్ మిస్త్రీ కుటుంబం మొరాకోలో చిక్కుకుపోయింది. ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలు.. ఆఫ్రికాలో చిక్కుకున్నవారిని తరలించిండం కోసం కేటాయించకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రిజేష్ మిస్త్రీ.. ఆఫ్రికాలో చిక్కుకున్న వారి పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొరాకో, అల్జీరియా రెండు దేశాల్లో కలిపి దాదాపు 300 మంది భారతీయులు.. ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రైవేట్ విమానాల్లో వచ్చేందుకు అనుమతించాలని వేడుకున్నారు. ప్రత్యేక విమానాల గురించి ఇండియన్ ఎంబసీ అధికారులను సంప్రదిస్తే వారు కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఆయన వాపోయారు. 


Updated Date - 2020-05-29T22:31:16+05:30 IST