Kuwait: అందులో భారతీయులే టాప్.. కువైత్ ఆరోగ్యశాఖ అధికారుల వెల్లడి

ABN , First Publish Date - 2022-06-28T14:05:53+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో భారతీయ ప్రవాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే.

Kuwait: అందులో భారతీయులే టాప్.. కువైత్ ఆరోగ్యశాఖ అధికారుల వెల్లడి

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో భారతీయ ప్రవాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ దేశానికి చెందిన సినీయర్ వైద్యులు డా. యూసెఫ్ బెహ్‌బెహనాని కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ దేశంలో ఆర్గాన్ డొనేషన్స్(అవయవదానం)లో భారతీయులే టాప్ ప్లేస్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా కువైత్ యూనివర్శిటీలోని కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యూసెఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కళాశాల తాత్కాలిక డీన్ డా. మహా అల్ సిజారీ దీన్ని ధృవీకరించారు. చనిపోయిన తర్వాత అవయవదానం చేస్తున్న ప్రవాసీయుల్లో భారతీయులు తొలిస్థానంలో ఉన్నట్లు యూసెఫ్ చెప్పారు. 


ఈ సందర్భంగా కువైత్ వైద్యులు మాట్లాడుతూ.. అవయవదానంపై సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయన్నారు. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయని తెలిపారు. అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి. దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కన్నా, కాలడం కన్నా ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు అత్యావసరంగా అవయవాలు అవసరం ఉన్న ఎంతోమందికి సహాయం చేసినవారు అవుతారని తెలిపారు. ఇక ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువేనని అన్నారు. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. భారత్ తర్వాత స్థానాల్లో వరుసగా ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ ప్రవాసులు ఉన్నారు. ఇక కువైత్ 1979లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ నిర్వహించి గల్ఫ్ దేశాల్లోనే తొలిసారి ఈ ఆపరేషన్ చేసిన దేశంగా నిలిచింది.    


Updated Date - 2022-06-28T14:05:53+05:30 IST