America లో దారుణం.. స్కూల్ క్యాంటీన్‌లో భారతసంతతి విద్యార్థిపై దాడి.. గొంతును చేత్తో బిగించి.. కింద పడేసి మరీ..

ABN , First Publish Date - 2022-05-18T03:20:29+05:30 IST

సీటులోంచి లేవమంటే లేవలేదన్న కోపంతో ఓ అమెరికా విద్యార్థి.. భారతీయ మూలాలున్న మరో విద్యార్థిపై దాడి చేశాడు.

America లో దారుణం.. స్కూల్ క్యాంటీన్‌లో భారతసంతతి విద్యార్థిపై దాడి.. గొంతును చేత్తో బిగించి.. కింద పడేసి మరీ..

ఎన్నారై డెస్క్: సీటులోంచి లేవమంటే లేవలేదన్న కోపంతో ఓ అమెరికా విద్యార్థి..  భారతీయ మూలాలున్న మరో విద్యార్థిపై దాడి చేశాడు. అతడి గొంతును చేత్తో బిగించి.. సీటులోంచి లాగి కింద పడేశాడు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డా.. ఆ శ్వేతజాతీయుడు లక్ష్యపెట్టలేదు. ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనితోడు.. స్యూల్ యాజమాన్యం దాడి చేసిన విద్యార్థికి ఒక్క రోజే పనిష్మెంట్ ఇచ్చి బాధిత విద్యార్థి షాన్ ప్రీత్మానీకి మూడు రోజుల పాటు పనిష్మెంట్ ఇవ్వడం.. అగ్నికి ఆజ్యం పోసినట్టైంది.  ఈ విషయంలో స్కూల్ యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టెక్సాస్ రాష్ట్రంలోని కోపెల్ ప్రాంతంలోగల కోపాల్ మిడిల్ స్కూల్‌లో నార్త్‌లో ఇటీవల ఈ దారుణం జరిగింది.


వైరల్ వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. సీటును ఖాళీ చేయాలంటూ ఓ విద్యార్థి షాన్‌పై ఒత్తిడి తెచ్చాడు. కానీ.. షాన్ ఇందుకు నిరాకరించాడు. ఆ సీటులో ఎవరూ లేని సమయంలోనే తాను వచ్చి కూర్చున్నానని, ఇప్పుడు మరో సీటులోకి వెళ్లడం కూదరదని శాంతంగానే జవాబిచ్చాడు. అయితే.. మరో సీటులోకి వెళ్లాలంటూ రెండు సార్లు గద్దించిన విద్యార్థి.. చివరకు షాన్ గొంతు చుట్టూ చేయి వేసి బిగించాడు. ఆ తరువాత.. అతడి మెడపై మోచేతితో పొడిచాడు. చివరకు అతడిని కిందకు లాగేశాడు. ఇదంతా సాటి విద్యార్థులు ఫోన్‌లో రికార్డు చేయడంతో ఇది ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు.. దాడి చేసిన విద్యార్థి తండ్రి స్కూల్ ట్రస్టీల బోర్డులో సభ్యుడు కావడంతోనే విషయాన్ని దాచి పెట్టేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తోందనే వాదన కూడా బయలు దేరింది. ఈ విషయంలో విద్యార్థి తండ్రికి పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. 


కాగా..  ఈ దాడికి సంబంధించిన వీడియో చూసి తన గుండె తరుక్కుపోయిందని షాన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ నాకు దుఃఖం ఆగలేదు. రాత్రంతా నిద్రరాలేదు. ఆ సందర్భంలో నా కుమారుడి మెడ విరిగిపోయి ఉండేది. వాడు నాకు దూరమై ఉండేవాడు. స్కూల్ వాళ్లేమో ఇదంతా విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవగా పేర్కొన్నారు.’’ అంటూ షాన్ తల్లి సోనికా కుక్రేజా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. షాన్‌పై దాడి వీడియో వైరల్ అవడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు ప్రకటించింది. అయితే.. షాన్ వేధింపులకు గురయ్యాడన్న విషయాన్ని మాత్రం స్కూల్ యాజమాన్యం తన ప్రకటనలో పేర్కనలేదు. ఈ ఘటన విద్యార్థుల మధ్య జరిగిన గొడవగా అభివర్ణించింది. తమకు న్యాయం చేయాలంటూ షాన్ తల్లి ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్‌పై ఇప్పటివరకూ 1.5 లక్షల మంది సంతకాలు చేశారు. 



Updated Date - 2022-05-18T03:20:29+05:30 IST