భారత సంతతి న్యాయవాదులకు షాకిచ్చిన సింగపూర్ న్యాయస్థానం! రూ.11 లక్షలు చెల్లించాలంటూ..

ABN , First Publish Date - 2022-05-27T02:13:51+05:30 IST

మరణ శిక్ష అమలులో జాప్యం జరిగేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఇద్దరు భారత సంతతి లాయర్లకు సింగపూర్ న్యాయస్థానం భారీ షాకిచ్చింది.

భారత సంతతి న్యాయవాదులకు షాకిచ్చిన సింగపూర్  న్యాయస్థానం! రూ.11 లక్షలు చెల్లించాలంటూ..

ఎన్నారై డెస్క్: మరణ శిక్ష అమలులో జాప్యానికి కారణమైన ఇద్దరు భారత సంతతి లాయర్లకు సింగపూర్ న్యాయస్థానం భారీ షాకిచ్చింది. ప్రాసిక్యూటర్ కార్యాలయానికి వారు 20 వేల సింగపూర్ డాలర్లు(రూ. 11 లక్షలు) చెల్లించాలని తీర్పు వెలువరించింది. మాదకద్రవ్యాల అక్రమరవాణా కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగం కేసుకు సంబంధించి అక్కడి కోర్ట్ ఆఫ్  అప్పీల్స్ తాజాగా ఈ తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 27న ధర్మలింగానికి మరణ శిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. 


ఈ కేసులో ప్రధాన లాయర్ అయిన ఎమ్. రవి..  కోర్టు చెప్పిన మొత్తంలో 75 శాతం చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని రెండో న్యాయవాది వైలట్ నెట్టో భరించాల్సి ఉంటుంది. ఇక.. ధర్మలింగం మరణ శిక్ష అమలును అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు లాయర్లు నిరర్థక పిటిషన్లు దాఖలు చేశారని అక్కడి ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. వారి ప్రయత్నాల ఫలితంగా తమకు ఆర్థిక భారం పెరిగిందని వాదించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  సింగపూర్ చట్టాల ప్రకారం.. ప్రభుత్వంతో అనవసర ఖర్చులు పెట్టించిన లాయర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని తీర్పిచ్చే హక్కు అక్కడి కోర్టులకు ఉంటుంది.


మాదకద్రవ్యాల అక్రమరవాణా కేసులో స్థానిక పోలీసులు ధర్మలింగాన్ని 2010లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధించింది.  దీన్ని సవాలు చేస్తూ ధర్మలింగం పలు మార్లు అప్పీలు చేసుకున్నా అక్కడి న్యాయస్థానాలు  కనికరించలేదు. ఇక మరణ శిక్ష అమలుకు కొద్ది రోజుల ముందు తీర్పును సమీక్షించాలంటూ ఎమ్.రవి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమైనవిగా అభివర్ణించిన న్యాయస్థానం ఆ ఇద్దరు లాయర్లకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. 



Updated Date - 2022-05-27T02:13:51+05:30 IST