అమెరికాలో భారత సంతతి విద్యార్థిపై దాడి.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు!

ABN , First Publish Date - 2022-05-25T02:04:12+05:30 IST

అమెరికాలో భారత సంతతి విద్యార్థిపై దాడిని ఖండించిన ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు!

అమెరికాలో భారత సంతతి విద్యార్థిపై దాడి..  తీవ్ర ఆందోళన  వ్యక్తం చేసిన ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు!

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఇటీవల ఓ శ్వేతజాతి విద్యార్థి..  భారత సంతతికి చెందిన ఓ స్టూడెంట్‌పై దాడి చేయడం అక్కడి భారతీయ అమెరికన్లలో కలకలం రేపిన విషయం తెలిసిందే.  కాపెల్ మిడిల్ స్కూల్‌లో మే 15న ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఈ ఘటనపై అమెరికాలోని భారత సంతతి చట్టసభ సభ్యులు తాజాగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినిధుల సభ సభ్యులు ఎమి బేరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ సోమవారం విద్యార్థిపై దాడిని ఖండిస్తూ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. స్కూల్లో ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి ఇలా వేధింపులకు గురవ్వడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. అమెరికాలోని భారత సంతతి వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.


‘‘అమెరికా చట్టసభ సభ్యులుగా, భారత అమెరికన్లకు ప్రతినిధులుగా ఈ ఘటన మమ్మల్ని చాలా బాధించింది’’ అని వారు పేర్కొన్నారు. తమ  ఆందోళనను కాపెల్ మిడిల్ స్కూల్ యాజమాన్యానికి కూడా తెలియజేస్తూ స్కూల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. మరోవైపు.. ఈ దాడి అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ రో ఖన్నా ట్వీట్ చేశారు. 


సీటులోంచి లేవమంటే విననందుకు ఓ అమెరికన్ విద్యార్థి  షాన్ ప్రీత్మానీపై దాడి చేసిన విషయం తెలిసిందే. తొలుత షాన్‌ను పక్కకు తోసే ప్రయత్నం చేసిన అతడు ఆపై షాన్  గొంతు చుట్టూ చేయి బిగించి కిందకు లాగేశాడు. ఈ దాడిలో తన బిడ్డ ఊపిరాడక ఇబ్బంది పడటాన్ని వీడియోలో చూసిన షాన్ తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డ తనకు దక్కకుండా పోతాడేమోనని భయపడిపోయినట్టు ఆమె పేర్కొంది. ఈ ఘటన పట్ల అమెరికాలోనే కాకుండా.. భారత్‌లోనూ కలకలం రేగింది.





Updated Date - 2022-05-25T02:04:12+05:30 IST