UK లో భారత యువకుడికి జీవిత ఖైదు.. చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2021-10-23T01:51:55+05:30 IST

బ్రిటన్‌లో ఓ భారత యువకుడికి అక్కడి న్యాయస్థానం తాజాగా జీవిత ఖైదు విధించింది.

UK లో భారత యువకుడికి జీవిత ఖైదు.. చేసిన నేరమేంటంటే..
భార్య గీతిక గోయల్‌తో కశిష్ అగర్వాల్..

లండన్: బ్రిటన్‌లో ఓ భారత యువకుడికి అక్కడి న్యాయస్థానం తాజాగా జీవిత ఖైదు విధించింది. ఈ ఏడాది మార్చి 3న కట్టుకున్న భార్యను అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపినందుకు యూకే కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. పూర్తి విరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగరానికి చెందిన కశిష్ అగర్వాల్(29)తో ఫిల్లౌర్ వాసి గీతిక గోయల్(25)కు 2016లో వివాహమైంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు యూకేలోని లీసెస్టర్ వెళ్లారు. అక్కడ వింటర్స్‌డేల్ రోడ్‌లో నివాసం ఉన్నారు. అయితే, అక్కడికి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత కశిష్, గీతికల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరు తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 3న ఇద్దరి మధ్య ఘర్షణ కాస్తా పెద్దదైంది. దీంతో కోపోద్రిక్తుడైన కశిష్ కత్తితో విచక్షణరహితంగా గీతికపై దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడ, ఛాతీ భాగాలపై 19సార్లు పొడిచాడు. దాంతో తీవ్రరక్తస్రావమై గీతిక అక్కడికక్కడే చనిపోయింది. 


అనంతరం కశిష్ భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఎవరికి కనిపించకుండా తన కారులో తీసుకెళ్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టి వచ్చేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ అందరిని నమ్మించాడు. పోలీసులకు కూడా అలాగే ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆ తర్వాతి రోజే కశిష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీలో గీతిక డెడ్‌బాడీని అతడు తన కారులో తీసుకెళ్లడం అందులో రికార్డైంది. ఆ దృశ్యాల ఆధారంగా కశిష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. తాజాగా ఈ కేసు యూకే కోర్టులో విచారణకు వచ్చింది. తన నేరాన్ని ఒప్పుకున్న కశిష్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కశిష్ కనీసం 20 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంటుంది.         

Updated Date - 2021-10-23T01:51:55+05:30 IST