అనామకుల నుంచి..ఫేవరెట్స్‌ వరకు

ABN , First Publish Date - 2020-02-20T10:03:08+05:30 IST

మహిళల క్రికెట్‌లో టీ20 ప్రపంచకప్‌ 2009లో ఆరంభమైంది. ఇంగ్లండ్‌లో పురుషుల టోర్నీకి సమాంతరంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. జులన్‌ గోస్వా మి నేతృత్వంలో

అనామకుల నుంచి..ఫేవరెట్స్‌ వరకు

ఆస్ట్రేలియాలో జరగబోయే మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఫేవరెట్స్‌ ఎవరు? అంటే అందులో కచ్చితంగా భారత జట్టు పేరుంటుంది. తొలి రెండు టోర్నీల్లో అనూహ్యంగా ఆడినా ఆ తర్వాత క్రమంగా వెనక్కివెళ్లింది. అప్పట్లో టీమిండియా గురించి స్వదేశంలోనూ ఎవరూ పట్టించుకోని పరిస్థితి. కానీ మనకూ మంచి రోజులు వస్తాయన్న ధీమాతో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. దీనికి తోడు జట్టులోని పలువురు స్టార్‌ బ్యాట్స్‌వుమెన్‌ దూకుడైన ఆటతో అందరి దృష్టినీ తమ వైపునకు తిప్పుకోగలిగారు. దీంతో భారత్‌ ప్రస్తుతం ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసరగలిగే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన టీ20 మెగా టోర్నీల్లో భారత జట్టు ప్రస్థానంపై ఓసారి దృష్టి సారిద్దాం.. 


టీ20 ప్రపంచక్‌పలో భారత మహిళల ప్రస్థానం

 మహిళల క్రికెట్‌లో  టీ20 ప్రపంచకప్‌ 2009లో ఆరంభమైంది. ఇంగ్లండ్‌లో పురుషుల టోర్నీకి సమాంతరంగా ఈ ఈవెంట్‌ను  నిర్వహించారు. జులన్‌ గోస్వా మి నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగింది. ఆ   టోర్నీలో కేవలం 8 జట్లు పాల్గొనగా నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. టాప్‌-2 టీమ్స్‌ నేరుగా సెమీస్‌ కు వెళ్లాయి. ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌లతో భారత్‌ గ్రూప్‌ దశలో ఆడింది. అయితే తొలి  పోరులో ఇంగ్లండ్‌ చేతి లో పది వికెట్ల తేడాతో ఓడిన భారత్‌ ఆ తర్వాత పాక్‌తో చావోరేవో మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. ఒత్తిడిని తట్టుకుంటూ పాక్‌ను కేవలం 75 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ అటు లంకను కూడా ఓడించి సెమీ్‌సకు అర్హత సాధించింది. అక్క డ మాత్రం పటిష్ఠ కివీస్‌ చేతిలో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకున్నా మెరుగైన ప్రదర్శనే కనబరిచింది.


2010- మళ్లీ  సెమీ్‌సలోనే బోల్తా..

ఎనిమిది జట్లతో తొలి  వరల్డ్‌కప్‌లో ఆడించిన ఫార్మాట్‌నే ఇక్కడా కొనసాగించారు. ఈసారి భారత్‌ గ్రూపులో శ్రీలం క, పాక్‌తోపాటు న్యూజిలాండ్‌ను చేర్చారు. దీంతో తొలి మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి ఎదురైనా ఆ తర్వాత పాక్‌, శ్రీలంకలపై గెలిచి వరుసగా రెండోసారి కూడా సెమీ్‌సకు చేరగలిగింది. కానీ ఈసారీ సెమీస్‌ అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో పరాజయం పాలై నిష్క్రమించాల్సి వచ్చింది. స్పిన్నర్‌ డయానా డేవిడ్‌ తొమ్మిది వికెట్లతో టోర్నీ టాప్‌ బౌలర్‌గా నిలవడం ఊరటనిచ్చింది.


2012- ఒక్క విజయమూ లేదు

శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీ భారత మహిళల జట్టుకు చేదు ఫలితాన్నే ఇచ్చింది. మిథాలీ రాజ్‌ నేతృత్వంలో జట్టు తొలిసారి బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్లతో పోటీపడగా ఈసారి కనీసం గ్రూప్‌ దశను కూడా దాటలేకపోయింది. ఆసీస్‌ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడగా.. ఇంగ్లండ్‌ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పూనమ్‌ రౌత్‌ ఈ రెండు మ్యాచ్‌ల్లో మెరిసినా ఫలితం లేకపోయింది. ఇక  గ్రూప్‌ చివరి పోరులో పాక్‌తోనైనా ఓదార్పు విజ యం దక్కుతుందనుకుంటే 98 పరుగులను కూడా ఛేదించలేక ఒక వికెట్‌ తేడాతో ఓడాల్సి వచ్చింది.


2016-స్వదేశంలో జరిగినా..

స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లండ్‌, విండీస్‌, పాక్‌, బంగ్లాదేశ్‌లను కలిగిన తమ గ్రూపులో మిథాలీ సేన నాలుగో స్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాపై గెలిచినా ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈటోర్నీలో అటు మిథాలీ కేవలం 78 పరుగులే సాధించడం జట్టు విజయాలపై ప్రభావం చూపింది.


2018-దూకుడుతో పాటు వివాదాలు...

తమ క్రికెట్‌ చరిత్రలో ఆరో టీ20 ప్రపంచక్‌పను భారత్‌ అత్యంత విజయవంతంగా  ముగించింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో దారుణ  వైఫల్యం తర్వాత జట్టులో అనేక మార్పులు జరిగాయి. కొత్త కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఆధ్వర్యంలో యువ రక్తంతో జట్టు బరిలోకి దిగింది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ దూకుడైన ఆటతో భారత్‌ ఈ టోర్నీలో సరికొత్తగా కనిపించింది. ఆసీస్‌, కివీస్‌, పాక్‌, ఐర్లాండ్‌లతో కూడిన తమ గ్రూపులో ప్రతీ మ్యాచ్‌ను  గెలుస్తూ సెమీ్‌సకు చేరింది. ఈ జోరు చూస్తే టైటిల్‌ ఖాయంగా అనిపించినా ఇంగ్లండ్‌ చేతిలో ఓడి నిరాశపరిచింది. అయితే వెటరన్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ గ్రూప్‌ దశలో ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలు చేసినా సెమీ్‌సకు ఆమెను పక్కకు తప్పించడం పెద్ద దుమారాన్నే రేపింది. ఆమె లేకపోవడం మ్యాచ్‌ ఫలితంపై కూడా ప్రభావం చూపింది.


2014- మిథాలీ మెరిసినా..

టోర్నీ  చరిత్రలో ఈసారి జట్ల సంఖ్య 8 నుంచి 10కి చేరింది. ప్రతీ గ్రూప్‌లో తొలి రెండు జట్లకు సెమీస్‌ బెర్త్‌ దక్కగా మూడో స్థానంలో నిలిచిన వారిని క్వాలిఫికేషన్‌ మ్యాచ్‌ ఆడించారు. ఇందులో గెలిచిన జట్టును తర్వాతి ఎడిషన్‌లో నేరుగా ఆడించారు. ఇక గ్రూప్‌ దశలో ఇంగ్లండ్‌, విండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ఆడిన భారత్‌ రెండు మ్యాచ్‌లే నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. కానీ పాక్‌పై అర్హత మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకుంది. మిథాలీ రాజ్‌ జట్టు తరఫున అత్యధిక పరుగులు (208) సాధించింది. 

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - 2020-02-20T10:03:08+05:30 IST