New Jersey: భారతీయ యువతి ఆచూకీ కోసం స్థానికుల సహాయం కోరిన ఎఫ్‌బీఐ.. ఇంతకీ ఆమె ఎవరంటే..

ABN , First Publish Date - 2022-07-21T18:00:07+05:30 IST

మూడేళ్ల నుంచి కనిపించకుండాపోయిన న్యూజెర్సీలో ఉండే భారతీయ యువతి ఆచూకీ కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(FBI) అధికారులు తాజాగా స్థానికుల సహాయం కోరారు.

New Jersey: భారతీయ యువతి ఆచూకీ కోసం స్థానికుల సహాయం కోరిన ఎఫ్‌బీఐ.. ఇంతకీ ఆమె ఎవరంటే..

న్యూయార్క్: మూడేళ్ల నుంచి కనిపించకుండాపోయిన న్యూజెర్సీలో ఉండే భారతీయ యువతి ఆచూకీ కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(FBI) అధికారులు తాజాగా స్థానికుల సహాయం కోరారు. ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. తాజాగా ఆమె పేరును మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్‌లో చేర్చిన అధికారులు ఈ మేరకు ప్రజల సహాయం కోరుతూ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మయూషీ భగత్(28) అనే భారతీయురాలు 2016లో F1 స్టూడెంట్ వీసాపై(Student Visa) అమెరికా వెళ్లింది. మొదట న్యూ హాంప్‌షైర్ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NYIT)లలో మూడేళ్లు విద్యాభ్యాసం కొనసాగించింది. 


ఈ క్రమంలో 2019, ఏప్రిల్ 29న న్యూజెర్సీలోని జెర్సీ సిటీలోని తన ఇంటి నుంచి బయటికెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు 2019, మే 1న భగత్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన భగత్ తిరిగి రాలేదని, తమకు తెలిసిన వారందరినీ వాకాబు ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇంటి నుంచి వెళ్లేటప్పుడు కలర్‌ఫుల్ పైజామా ప్యాంట్, నల్లరంగు టీషర్ట్ ధరించినట్లు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు, వారిచ్చిన సమాచారంతో భగత్ ఆచూకీ కోసం పోలీసులు బాగానే వెతికారు. కానీ, ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. తాజాగా ఈ కేసు ఎఫ్‌బీఐ చేతికి వచ్చింది. 


దాంతో భగత్ పేరును మిస్సింగ్ పర్సన్స్ జాబితాలో చేర్చిన నెవార్క్ డివిజన్ ఎఫ్‌బీఐ అధికారులు.. ఆమె వివరాలను తెలియజేస్తూ వెబ్‌సైట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా భగత్ ఆచూకీ కోసం స్థానికుల సహాయం కోరారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే దగ్గరిలోని స్థానిక ఎఫ్‌బీఐ కార్యాలయనికి గానీ, అమెరికన్ ఎంబసీ లేదా కాన్సులేట్‌కు తెలియజేయాలని ఎఫ్‌బీఐ అధికారి జేమ్స్ డెన్నెహీ పేర్కొన్నారు. ఇక ఆమె ఇంటి నుంచి వెళ్లినప్పుడు కలర్‌ఫుల్ పైజామా ప్యాంట్, నల్లరంగు టీషర్ట్ ధరించినట్లు తెలిపారు. అలాగే 5.10 అడుగుల ఎత్తు, చామన్ ఛాయ రంగు, నల్లటి కురులతో ఉంటుందని.. ఇంగ్లీష్, హిందీ, ఉర్ధూ బాగా మాట్లాడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఫొటోలతో కూడిన ఓ పోస్టర్‌ను ఎఫ్‌బీఐ అధికారులు విడుదల చేశారు.     



Updated Date - 2022-07-21T18:00:07+05:30 IST