Abn logo
Mar 4 2021 @ 09:28AM

దుబాయిలో రూ. 7 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు

దుబాయి: భారతదేశానికి చెందిన రాహుల్ జుక్లా(53) అనే వ్యక్తి దుబాయిలో 10 లక్షల డాలర్ల(రూ. 7.30 కోట్లు) లాటరీని గెలుపొందారు. దుబాయి డ్యూటీ ఫ్రీ మిల్లెనియమ్ మిలియనీర్ రాఫిల్‌లో రాహుల్ విజేతగా నిలిచారు. తాను 14 ఏళ్లుగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తూ రాగా.. అదృష్టం ఇప్పటికి వరించిందంటూ రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు లాటరీ తప్పకుండా తగులుతుందన్న నమ్మకంతోనే తాను 14 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తూ వచ్చినట్టు రాహుల్ చెప్పారు. రాహుల్‌తో కలిపి దుబాయి డ్యూటీఫ్రీ మిలియనర్ రాఫిల్‌లో ఇప్పటివరకు 177 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. 


ఈ సమయంలో తనకు లాటరీ తగలడం ఎంతో ఆనందంగా ఉందని, తన రిటైర్మెంట్‌కు, పిల్లల భవిష్యత్తుకు లాటరీ డబ్బును ఉపయోగిస్తానని తెలిపారు. కాగా.. ముంబాయికి చెందిన రాహుల్ చాలా సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి దుబాయికి పొట్టకూటి కోసం వెళ్లారు. 2009లో దుబాయి నుంచి ఆయన నైజీరియాకి వలస వెళ్లి అక్కడే జీవిస్తూ వస్తున్నారు. నైజీరియా వెళ్లినప్పటికి ఆయన లాటరీ టికెట్లను కొనుగోలు చేయడం మాత్రం ఆపలేదు.  

Advertisement
Advertisement
Advertisement