‘అర్జున’కు రాహుల్‌

ABN , First Publish Date - 2020-05-28T08:48:25+05:30 IST

తెలుగు లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌ అంతర్జాతీయ స్థాయి ప్రతిభను భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌) గుర్తించింది. 25 ఏళ్ల రాహుల్‌ను అర్జున ...

‘అర్జున’కు రాహుల్‌

మీరాబాయ్‌ చాను కూడా..

వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య సిఫారసు


న్యూఢిల్లీ: తెలుగు లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌ అంతర్జాతీయ స్థాయి ప్రతిభను భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌) గుర్తించింది. 25 ఏళ్ల రాహుల్‌ను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్‌ 2014లో మలేసియాలో జరిగిన కామన్వెల్త్‌ యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌ప 77 కిలోల కేటగిరిలో.. యూత్‌, జూనియర్‌ విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలతో మెరిశాడు. ఇక 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో 85 కిలోల కేటగిరిలో పసిడి పతకంతో సత్తా చాటాడు.


మీరా పేరుపై చర్చ..

స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చానుని కూడా అర్జునకు నామినేట్‌ చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ప్రపంచ మాజీ చాంపియన్‌ అయిన చాను.. ఇప్పటికే క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అందుకుంది. అలాంటిది ఆమె పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించడంపై చర్చ మొదలైంది. చానుతోపాటు పూనమ్‌ యాదవ్‌నూ అర్జునకు నామినేట్‌ చేసింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి 2018లో మీరాబాయ్‌ ఖేల్‌రత్న అవార్డు అందుకుంది. అదే ఏడాది దేశ నాలుగో అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీ కూడా దక్కించుకుంది. అర్జున అవార్డు కూడా ఎంతో గౌరవమైనదని అందువల్ల ఖేల్‌రత్న తర్వాత దానిని అందుకొనేందుకు తనకు అభ్యంతరంలేదని 25 ఏళ్ల చాను పేర్కొంది. ‘ఖేల్‌రత్న అత్యున్నత పురస్కారమని తెలుసు. అయితే గతంలో అర్జున అవార్డును మిస్సయ్యా. అందువల్ల దానినీ కోరుకుంటున్నా. అర్జున పురస్కారం అందుకోవాలని ఏ ఆటగాడికి మాత్రం ఉండదు’ అని ప్రశ్నించింది. ఇక..ఖేల్‌రత్న పొందిన అథ్లెట్‌ను అర్జున అవార్డుకు కూడా నామినేట్‌ చేయవచ్చని  ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌ కార్యదర్శి సహదేవ్‌ యాదవ్‌ అన్నారు. 

Updated Date - 2020-05-28T08:48:25+05:30 IST