Achinta Sheuli: కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటిన 20 ఏళ్ల యువ తేజం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

ABN , First Publish Date - 2022-08-01T19:24:52+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇండియన్ వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. తాజాగా భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి స్వర్ణం గెలుచుకుని కామన్వెల్త్‌లో మరో పతకాన్ని..

Achinta Sheuli: కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటిన 20 ఏళ్ల యువ తేజం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్ గేమ్స్ 2022లో (commonwealth games) ఇండియన్ వెయిట్ లిఫ్టర్ల (weight lifter) హవా కొనసాగుతోంది. తాజాగా భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి (achinta sheuli) స్వర్ణం గెలుచుకుని కామన్వెల్త్‌లో మరో పతకాన్ని భారత్ ఖాతాలో జమ చేశాడు. 20 ఏళ్ల వయసున్న ఈ యువ వెయిట్ లిఫ్టర్ పురుషుల 73 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నాడు. బెంగాల్‌కు చెందిన ఈ యువ వెయిట్ లిఫ్టర్ 313 కేజీల బరువును ఎత్తి సత్తా చాటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీల్లో అచింత షూలి పసిడి గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ ఎర్రి హిదాయత్ మహ్మద్ అచింతకు గట్టి పోటీ ఇచ్చాడు. హిదాయత్ మహ్మద్ 303 కేజీలను ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. కెనడాకు చెందిన వెయిట్ లిఫ్టర్ షాద్ దార్సిగ్నీ 298 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు స్వర్ణం సాధించిన అచింత షూలికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అచింత షూలితో తాను మాట్లాడటం జరిగిందని, తన తల్లి, సోదరుడి సహకారంతో తాను లక్ష్య సాధన దిశగా అడుగులేసినట్లు అచింత తనతో చెప్పాడని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. స్వర్ణ పతకం సాధించిన అచింతకు సినిమా చూసేందుకు సమయం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.



కామన్వెల్త్ గేమ్స్‌లో అచింత సాధించిన స్వర్ణంతో కలిపి భారత్ ఆరు పతకాలు సాధించింది. పురుషుల 67 కిలోల విభాగంలో టీనేజర్‌ జెరెమి లాల్‌రినుంగ సంచలన ప్రదర్శనతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అంతకుముందు మహిళల 55 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి రజతంతో మెరిసింది. పురుషుల 67 కిలోలలో 19 ఏళ్ల జెరెమి లాల్‌రినుంగ రెండు కామన్వెల్త్‌ రికార్డులతో పసిడి పతకం కొల్లగొట్టాడు. యూత్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ జెరెమి.. స్నాచ్‌లో 140 కి. ఎత్తి సరికొత్త గేమ్స్‌ రికార్డు సృష్టించాడు. అనంతరం క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 160 కి.తో మొత్తం 300 కి. ఎత్తి టైటిల్‌ దక్కించుకున్నాడు. 300కి. టోటల్‌ కూడా కామన్వెల్త్‌ క్రీడల రికార్డు కావడం గమనార్హం. సమోవాకు చెందిన వైపవా లొనె (127+166=293కి.) రజతం, నైజీరియా లిఫ్టర్‌ ఎడిడియోంగ్‌ ఉమోఫియా (130+160= 290కి.) కాంస్య పతకం నెగ్గారు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ సందర్భంగా కాలి కండరాల నొప్పితో జెరిమి విలవిల్లాడాడు. అయినా వెనక్కు తగ్గకుండా లక్ష్యంమేర బరువెత్తి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు.

Updated Date - 2022-08-01T19:24:52+05:30 IST