ఆకస్మిక వరదలను ముందే పసిగట్టే వ్యవస్థ

ABN , First Publish Date - 2020-10-24T08:51:56+05:30 IST

అకస్మాత్తుగా విరుచుపడే వరదలను 6 నుంచి 24 గంటల ముందుగానే పసిగట్టే వ్యవస్థను దక్షిణాసియా దేశాల కోసం భారత వాతావరణ విభాగం శుక్రవారం ఆవిష్కరించింది...

ఆకస్మిక వరదలను ముందే పసిగట్టే వ్యవస్థ

న్యూఢిల్లీ, అక్టోబరు 23: క్షణాల్లో పోటెత్తి.. నీటి సుడిగుండాల్లో ముంచెత్తి.. ఎంతోమంది ప్రాణాలను హరించి.. ఇంకెంతో మందికి కన్నీటిని మిగిల్చే మాయదారి వరద ముప్పు గురించి కాస్త ముందుగానే తెలుసుకునే వెసులుబాటు ఉంటే? అప్పుడు అప్రమత్తంగా ఉంటాం కాబట్టి ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. విలువైన ఆస్తులనూ కాపాడుకోవచ్చు.. అవునా! ఈ మేరకు అకస్మాత్తుగా విరుచుపడే వరదలను 6 నుంచి 24 గంటల ముందుగానే పసిగట్టే వ్యవస్థను దక్షిణాసియా దేశాల కోసం భారత వాతావరణ విభాగం శుక్రవారం ఆవిష్కరించింది. వరదలపై ముందే అప్రమత్తం చేసే వ్యవస్థ ఒకటి అందుబాటులోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా మన దేశం సహా శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌లలో వరదలకు సంబంధించి కొన్ని కనీసం ఆరు గంటలు గరిష్ఠంగా ఒక రోజు ముందుగానే అప్రమత్తం కావచ్చునని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా చెప్పారు. కార్యక్రమానికి ఆయా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.  అమెరికా జాతీయ వాతావరణ సేవా విభాగం, అమెరికా హైడ్రాలిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సహకారంతో ప్రపంచ వాతావరణ సంస్థ రూపొందించింది. 

Updated Date - 2020-10-24T08:51:56+05:30 IST