ఇంగ్లండ్‌ చేరిన భారత జట్లు

ABN , First Publish Date - 2021-06-04T09:17:05+05:30 IST

దాదాపు మూడున్నర నెలల పర్యటనలో భాగంగా టీమిండియా గురువారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది.

ఇంగ్లండ్‌ చేరిన భారత జట్లు

కుటుంబ సభ్యులతో పయనం


లండన్‌: దాదాపు మూడున్నర నెలల పర్యటనలో భాగంగా టీమిండియా గురువారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. విరాట్‌ కోహ్లీ సేనతో పాటు మహిళల క్రికెట్‌ జట్టు, వారి కుటుంబసభ్యులు కూడా వీరితో పాటున్నారు. లండన్‌ విమానాశ్రయంలో దిగిన అనంతరం బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ట్విటర్‌లో ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఇక ఈ రెండు జట్లు లండన్‌ నుంచి సౌతాంప్టన్‌కు వెళ్లి, మూడు రోజుల క్వారంటైన్‌ తర్వాత నెట్స్‌లో పాల్గొంటారు.


అంతకన్నా ముందు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీమిండియా ఈనెల 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడుతుంది. కొద్ది రోజుల విరామం తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతుంది. అటు మహిళల జట్టు ఓ టెస్టు, మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 15తో మహిళల టూర్‌ ముగుస్తుంది.


వామిక ఫొటోలపై ఆగ్రహం: బుధవారం రాత్రి భారత్‌ నుంచి బయలుదేరిన క్రికెటర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక బస్సు దిగి ముంబై విమానాశ్రయంలోనికి వెళుతున్న సమయంలో విరాట్‌, అనుష్కల కూతురు వామికను ఫొటో తీసేందుకు ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. దీంతో అనుష్క తన కూతురు ముఖం కనిపించకుండా చేతిని అడ్డం పెట్టింది. అయితే ఈ విషయంలో సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘చిన్నారికి గాలి కూడా ఆడకుండా అనుష్క ప్రయత్నిస్తోంది’ అని కొందరు విమర్శించగా.. మరికొందరు మాత్రం ‘కోహ్లీ దంపతుల ప్రైవసీని గౌరవించాలి. కూతురిని ఫొటో తీయడం వారికి ఇష్టం లేదు. అయినా వినకుండా పాప ఫొటోలను మీరెందుకు పోస్ట్‌ చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.

Updated Date - 2021-06-04T09:17:05+05:30 IST