ఓదార్పు దక్కేనా..?

ABN , First Publish Date - 2022-01-23T08:31:19+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత జట్టు వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోగలదా? తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలో రాహుల్‌ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో జట్టు..

ఓదార్పు దక్కేనా..?

విజయం కోసం భారత్‌ ఆరాటం

క్లీన్‌స్వీప్  లక్ష్యంగా దక్షిణాఫ్రికా

నేడే చివరి వన్డే

మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కోహ్లీ శతకం చేయక 64 ఇన్నింగ్స్‌ పూర్తయ్యాయి.

కేప్‌టౌన్‌లో ఆడిన 37 వన్డేల్లో దక్షిణాఫ్రికా 31 మ్యాచ్‌లు నెగ్గింది.

దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభానికి ముందు భారత జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. సంధి దశలో ఉన్న ఆతిథ్య జట్టుపై స్టార్లతో కూడిన టీమిండియా టెస్టు, వన్డే సిరీ్‌సలను సులువుగా గెలిచేస్తుందనే అంతా భావించారు. కానీ అతి విశ్వాసమో.. పోరాడలేని తత్వమో కానీ రిక్తహస్తాలతోనే వెనుదిరగాల్సి వస్తోంది. నామమాత్రమైన నేటి చివరి వన్డేలోనైనా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని రాహుల్‌ సేన భావిస్తోంది.


కేప్‌టౌన్‌: మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత జట్టు వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోగలదా? తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలో రాహుల్‌ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో జట్టు ఆటతీరుపై అపనమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ చెలరేగి విజయంతో టూర్‌ను ముగించాలనుకుంటోంది. వేదిక కూడా కేప్‌టౌన్‌కు మారడంతో పరాజయాలకు తెర పడుతుందని జట్టు ఆశిస్తోంది. అటు ఆతిథ్య జట్టు మాత్రం ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంది. మరో విజయంతో భారత్‌పై క్లీన్‌స్వీ్‌ప సాధించాలనే పట్టుదలతో ఉంది.  


బుమ్రాకు విశ్రాంతి:

అవిశ్రాంతంగా ఆడుతున్న స్టార్‌ పేసర్‌ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే చాన్సుంది. అదే జరిగితే సిరాజ్‌కు అవకాశం రావొచ్చు. ఇక ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వెటరన్‌ భువనేశ్వర్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.  సూర్యకుమార్‌, రుతురాజ్‌లకు కూడా ఇప్పటి వరకు ఆడే చాన్స్‌ రాలేదు. స్పిన్‌కు అనుకూలించిన రెండు వన్డేల్లోనూ స్పిన్‌ ద్వయం అశ్విన్‌, చాహల్‌ ఇబ్బందిపెట్టలేకపోయారు. అలాగే చివరి 23 వన్డేల్లో భారత బౌలర్లు పవర్‌ప్లేలో 10వికెట్లు మాత్రమే తీశారు. 132.10 సగటు, 5.74 ఎకానమీతో మిగతా అన్ని జట్లకన్నా భారత్‌ వెనుకంజలో ఉంది. ఇక ఈ సిరీ్‌సలో తీసింది ఏడు వికెట్లే. కొత్త బంతితో ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టే విషయంలో చాలా మెరుగవ్వాల్సి ఉంది. మిడిలార్డర్‌లో శ్రేయాస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ ఇబ్బందిపడడం జట్టును నష్టపరుస్తోంది. ఇక కోహ్లీ శతక దాహం ఈ మ్యాచ్‌లోనైనా తీరాలని అభిమానులు భావిస్తున్నారు.


అదే జోష్‌తో..:

టాపార్డర్‌ అద్భుతంగా రాణిస్తుండడంతో దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనలో బెదరడం లేదు. రెండో వన్డేలో తొలి ఐదుగురు బ్యాటర్స్‌ భారత బౌలర్లను ఆడేసుకున్నారు. ఓపెనర్లు డికాక్‌, యానెమన్‌ మలాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు బవుమా, మార్‌క్రమ్‌, డుస్సెన్‌, మిల్లర్‌ ఇలా ఒక్కసారిగా ఈ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ భారత్‌కన్నా పటిష్టంగా కనిపిస్తోంది. అలాగే పేసర్లు రబాడ, నోకియా లేకపోయినా వారి లోటు కనిపించకుండా బౌలర్లు రాణిస్తూ ఇప్పటికే సిరీస్‌ను అందించారు. ఎన్‌గిడికి రెస్ట్‌ ఇచ్చి జాన్సెన్‌ లేదా ప్రిటోరియ్‌సను బరిలోకి దించొచ్చు.


జట్లు (అంచనా)

భారత్‌:

రాహుల్‌ (కెప్టెన్‌), ధవన్‌, కోహ్లీ, పంత్‌, శ్రేయ్‌స/సూర్యకుమార్‌, వెంకటేశ్‌, శార్దూల్‌, అశ్విన్‌, దీపక్‌/భువనేశ్వర్‌, సిరాజ్‌, చాహల్‌.


దక్షిణాఫ్రికా:

డికాక్‌, యానెమన్‌ మలాన్‌, బవుమా (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, డుస్సెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, కేశవ్‌, జాన్సెన్‌/ప్రిటోరియస్‌, మగలా, షంసీ. 

Updated Date - 2022-01-23T08:31:19+05:30 IST