Taliban ప్రతినిధులతో భారత అధికారుల బృందం భేటీ

ABN , First Publish Date - 2022-06-03T02:14:59+05:30 IST

అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది.

Taliban ప్రతినిధులతో భారత అధికారుల బృందం భేటీ

కాబూల్ : అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ట్వీట్ చేశారు. ‘‘ ఆఫ్ఘనిస్తాన్‌లో గతేడాది ఆగస్టు 15 తర్వాత భద్రతా పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో భారతీయ అధికారులందరినీ వెనక్కి తీసుకురావాలని నిర్ణయించాం. అయితే అక్కడి స్థానిక సిబ్బంది కార్యకలాపాలు కొనసాగించారు. సరైన రీతిలో నిర్వహణ, దౌత్యకార్యాలయ ప్రాంగణాలపట్ల జాగ్రత్త వహించారు. భారత్, అఫ్ఘనిస్తాన్ మధ్య చరిత్రాత్మక బంధాలపై భారతీయ అధికారులు చర్చలు జరిపారు. అఫ్ఘనిస్తాన్ ప్రజలతో భారత్‌కు దీర్ఘకాల, చరిత్రాత్మక బంధాలు ఉన్నాయి. అఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్ వైఖరి గతం మాదిరిగానే కొనసాగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.


చర్చల్లో భాగంగా తాలిబన్ సీనియర్ సభ్యులతో ఇండియన్ టీం సమావేశమైంది. ఈ సందర్భంగా తాలిబన్ల ప్రతినిధి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. అఫ్ఘనిస్తాన్‌లో నిలిచిపోయిన భారత ప్రాజెక్టులను పునరుద్దరించాలని కోరుకుంటున్నామని తెలిపాడు. దౌత్యబంధాలు తిరిగి  క్రియాశీలకం చేయాలని, అఫ్ఘాన్‌కు దౌత్య సేవలను అందివ్వాలని ఆకాంక్షించాడు. ముఖ్యంగా విద్యార్థులు, రోగులను భారత్ దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. వాణిజ్య బంధాలను కూడా సంపూర్ణంగా పునరుద్ధరించాలని కోరాడు. అయితే భారతీయ ప్రాజెక్టులు నిలిచిపోయిన ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నట్టు తాలిబన్ ప్రతినిధులకు అరిందమ్ బాగ్చి తెలియజేశారు. మానవతాదృక్పథంతో  అఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా అధికారులు వారికి గుర్తుచేశారు. కాగా అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్ర్కమించిన తర్వాత ఆల్ ఇండియా మిషన్ స్టాఫ్ కూడా అక్కడి నుంచి వచ్చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-03T02:14:59+05:30 IST