Abn logo
Mar 8 2021 @ 04:00AM

బయో బబుల్‌ను అధిగమిస్తూ.. టీమిండియా జైత్రయాత్ర

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)కరోనా కష్టకాలంలో కొంతకాలంగా భారత జట్టు బయో బబుల్‌లో ఉంటూ సిరీ్‌సలను ఆడుతూనే ఉంది. గతేడాది ఆగస్టు నుంచి కోహ్లీ సేన ఒక బబుల్‌ నుంచి మరో బబుల్‌కు మారుతూ అత్యంత కఠిన పరిస్థితుల్లో గడుపుతోంది. బయట ఎక్కడికీ వెళ్లలేరు.. ఇతర వ్యక్తులతో మాట్లాడే పరిస్థితీ లేదు. మ్యాచ్‌ ముగిశాక స్టేడియం నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లాల్సిందే. ఈ సమయంలో ఆటగాళ్లు క్రికెట్‌పై మనసు పెట్టడం అంత సులువేమీ కాదు. అందుకే పలువురు ఇతర జట్ల ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోయారు కూడా. కానీ భారత్‌ మాత్రం సవాళ్లను స్వీకరిస్తూ ఫలితాలను సాధిస్తోంది. 2020లో యూఏఈలో దాదాపు రెండు నెలలపాటు జరిగిన ఐపీఎల్‌ ముగిశాక ఆటగాళ్లు నేరుగా ఆసీస్‌ టూర్‌కు వెళ్లారు. అక్కడ మరింత కఠినమైన బబుల్‌లో ఉంటూ టీ20, టెస్టు సిరీ్‌సలను గెలిచి స్వదేశానికి వచ్చారు. ఇక్కడ నాలుగు టెస్టుల సిరీ్‌సను 3-1తో నెగ్గడమే కాకుండా ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఓరకంగా బబుల్‌ నిబంధనలు కూడా మంచే చేశాయేమో. ఎందుకంటే మ్యాచ్‌లు ముగిశాక బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో హోటల్స్‌లోని ప్లేయర్స్‌ ఏరియాలో అంతా కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.


అటు ఆటకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చర్చించుకున్నారు. అంతేకాకుండా ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోసాగారు. తాము వచ్చిన నేపథ్యం, మానసిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ప్రస్తుత ఆర్థిక విషయాలు ఇలా అన్నింటినీ స్వేచ్ఛగా పంచుకునే సమయం చిక్కింది. ఒకరిపై మరొకరికి నమ్మకం పెరిగింది. దీంతో మైదానంలోనూ సుహుృద్భావ వాతావరణం ఏర్పడింది. మరోవైపు క్వారంటైన్‌ను దృష్టిలో ఉంచుకుని 17-18 మంది ఆటగాళ్లతో కాకుండా 25 మందితో టూర్‌లకు వెళ్లడం కూడా జట్టుకు లాభించింది. ఈ కారణంగా నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌లాంటి ఆటగాళ్లు అనూహ్యంగా టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకుని వెలుగులోకి రాగలిగారు. ఇలా బబుల్‌ కారణంగా మంచే జరిగిందని చెప్పవచ్చు.

 ఓటములే సోపానాలుగా..

 ఐపీఎల్‌ ముగిశాక భారత జట్టు వరుసగా రెండు వన్డేల ఓటములతో ఆసీస్‌ టూర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత 36 పరుగులకే కుప్పకూలి తొలి టెస్టులో ఓటమి పాలైంది. కానీ అద్వితీయంగా పుంజుకుని 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను గెలుచుకుంది. ఇక్కడా ఇంగ్లండ్‌తో అదే తీరు. తొలి టెస్టులో చిత్తయ్యారు. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా, కుటుంబాలకు దూరంగా ఉన్న వేళ ఇలాంటి ఓటములు క్రికెటర్లను మానసికంగా కుంగదీస్తాయి. అయితే వారి పరిస్థితిని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అర్థం చేసుకుని అండగా నిలిచింది. ఒక్క గెలుపుతో అంతా మారుతుందని ఓపిగ్గా ఎదురు చూసి ఫలితం సాధించింది. ఆసీ్‌సతో మూడో వన్డే ద్వారా భారత్‌ ట్రాక్‌లోకి వచ్చింది. ఓవైపు ఆటగాళ్లు గాయాలతో దూరమవుతున్నా.. ఆ తర్వాత టీ20, టెస్టు సిరీ్‌సలను కైవసం చేసుకోగలిగింది. తాజాగా ఇంగ్లండ్‌పైనా 3-1తో విజయఢంకా మోగించి ఈ ఫార్మాట్‌లో తిరిగి నెంబర్‌వన్‌గా నిలవడం భారత క్రికెటర్ల పోరాటానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

Advertisement
Advertisement
Advertisement