సుమీ నుంచి భారతీయ విద్యార్థులు పోల్టావాకు బయల్దేరారు : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-03-09T00:10:52+05:30 IST

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో

సుమీ నుంచి భారతీయ విద్యార్థులు పోల్టావాకు బయల్దేరారు : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు పోల్టావాకు బయల్దేరినట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మంగళవారం విలేకర్లకు చెప్పారు. 694 మంది విద్యార్థులు బస్సుల్లో బయల్దేరినట్లు తెలిపారు. సోమవారం రాత్రి తాను కంట్రోల్‌ రూమ్ అధికారులతో మాట్లాడానని చెప్పారు. 


ఇదిలావుండగా, ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, సుమీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి ఒకరు మాట్లాడుతూ, బస్సులు వచ్చాయని, తాము పోల్టావాకు బయల్దేరుతున్నామని చెప్పారు. తాము సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు. తమ కష్టాలకు తెరపడిందని చెప్పారు. 


సుమీ నగరం నుంచి ప్రజలను తరలించడంలో భాగంగా వీరిని పోల్టావాకు పంపిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌కు సమీపంలోని ఇర్పిన్ నగరం నుంచి కూడా ప్రజలను తరలిస్తున్నారు. పోల్టావా నగరం సెంట్రల్ ఉక్రెయిన్‌లో ఉంది. సుమీ నగరం నుంచి ప్రజలను తరలిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోను ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఇతర మానవతావాద కారిడార్లకు కూడా అంగీకరించాలని రష్యాను కోరినట్లు తెలిపింది. 


సుమీ నగరం రష్యా సరిహద్దులకు సమీపంలో ఉంది. కీవ్ నగరానికి తూర్పున సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రష్యా-ఉక్రెయిన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. మంగళవారం వైమానిక దాడిలో ఇద్దరు బాలలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2022-03-09T00:10:52+05:30 IST