సంక్షోభంలో 13 యూకే యూనివర్సిటీలు.. భారత విద్యార్థులు రాక విలవిల

ABN , First Publish Date - 2020-07-07T14:07:21+05:30 IST

కరోనా ప్రభావంతో బ్రిటన్‌లో యూనివర్సిటీలు కుదేలవుతున్నాయి. భారతీయ విద్యార్థులు ఈసారి ప్రవేశాలకు దూరంగా ఉంటే రూ.13 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు నష్టపోనున్నాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిస్కల్‌ స్టడీస్‌ వెల్లడించింది. బ్రిటన్‌లో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో తొలిస్థానంలో చైనా, రెండో స్థానంలో భారత్‌కు చెందిన వారుంటారు.

సంక్షోభంలో 13 యూకే యూనివర్సిటీలు.. భారత విద్యార్థులు రాక విలవిల

రూ. 13వేల కోట్ల నుంచి 40వేల కోట్ల నష్టం

ప్రభుత్వ ప్యాకేజీ కోసం ఎదురుచూపులు

లేకుంటే 13 వర్సిటీలు మూసివేయాల్సిందే

లండన్‌, జూలై 6: కరోనా ప్రభావంతో బ్రిటన్‌లో యూనివర్సిటీలు కుదేలవుతున్నాయి. భారతీయ విద్యార్థులు ఈసారి ప్రవేశాలకు దూరంగా ఉంటే రూ.13 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు నష్టపోనున్నాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిస్కల్‌ స్టడీస్‌ వెల్లడించింది. బ్రిటన్‌లో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో తొలిస్థానంలో చైనా, రెండో స్థానంలో భారత్‌కు చెందిన వారుంటారు. ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి ఆదుకోకుంటే ప్రపంచంలోనే పేరొందిన 13 వర్సిటీలు మూసివేయాల్సిన పరిస్థితి తప్పదని ఐఎ్‌ఫఎస్‌ నివేదికలో పేర్కొంది. కరోనాకు ముందు నుంచి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న వర్సిటీలు ప్రమాదం అంచుకు చేరుకున్నాయని నివేదికలో పేర్కొంది. ఇవి గాడిన పడాలంటే కనీసం 140 మిలియన్‌ డాలర్ల(సుమారు 1044 కోట్లు) మేర నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. ఈ సెప్టెంబరులో జరగాల్సిన విదేశీ విద్యార్థుల ప్రవేశాల కోటాలో కనీసం సగం మంది కూడా చేరకపోవచ్చని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిస్కల్‌ స్టడీస్‌’ నివేదికలో పేర్కొంది. మొత్తంగా చూస్తే విదేశీ విద్యార్థుల ప్రవేశాలు పూర్తిగా జరగకపోతే రూ.27 వేల కోట్ల నుంచి 1.77 లక్షల కోట్ల మేర నష్టం ఉండవచ్చని ఐఎ్‌ఫఎస్‌ అంచనా వేసింది.


విద్యార్థుల వెనుకంజ

బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల్లో గత ఏడాది చేరిన భారత విద్యార్థుల సంఖ్య 37,540. ఈ ఏడాది అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 64 శాతం మంది చేరే పరిస్థితి కనిపించటం లేదని యూకే భారతీయ విద్యార్థుల సంఘం, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, ప్రయాణ నిబంధనల కారణంగా చాలా మంది ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారని సర్వే పేర్కొంది. ఒకవేళ కోర్సుని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే అంతంత పెద్దమొత్తంలో ఉన్న ఫీజును చెల్లించేందు విద్యార్థులు సిద్ధంగా లేరని  పూర్వవిద్యార్థుల సంఘం ఛైర్‌ పర్సన్‌ సనమ్‌ అరోరా తెలిపారు. బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో  పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తరగతి గదిలో చెప్పే తీరు, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్‌ వంటివన్నీ విదేశీ విద్యార్థులను ఆకట్టుకుంటాయని సనమ్‌ వివరించారు.


Updated Date - 2020-07-07T14:07:21+05:30 IST