అమెరికాను కాదని కెనడాకు క్యూ కడుతున్న భారత విద్యార్థులు.. కారణమిదే..

ABN , First Publish Date - 2021-07-27T14:29:14+05:30 IST

ఒకప్పుడు విదేశీ చదువులంటే వెంటనే గుర్తొచ్చే పేరు అగ్రరాజ్యం అమెరికానే. విదేశీ విద్య కోసం ఇంతకుముందు భారతీయ విద్యార్థులు ఎక్కువగా యూఎస్‌కే వెళ్లేది. కానీ, తాజాగా ఆ పరిస్థితి మారింది. ప్రస్తుతం మన విద్యార్థులు అత్యధికంగా కెనడా వైపు చూస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికాను కాదని కెనడాకు క్యూ కడుతున్న భారత విద్యార్థులు.. కారణమిదే..

న్యూఢిల్లీ: ఒకప్పుడు విదేశీ చదువులంటే వెంటనే గుర్తొచ్చే పేరు అగ్రరాజ్యం అమెరికానే. విదేశీ విద్య కోసం ఇంతకుముందు భారతీయ విద్యార్థులు ఎక్కువగా యూఎస్‌కే వెళ్లేది. కానీ, తాజాగా ఆ పరిస్థితి మారింది. ప్రస్తుతం మన విద్యార్థులు అత్యధికంగా కెనడా వైపు చూస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ. మురళీధరన్ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపిన వివరాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో 11.33 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదవుతుంటే.. వీరిలో అత్యధికంగా 2.15 లక్షల మంది కెనడాలో ఉన్నట్లు తెలిపారు.


ఆ తర్వాత 2.11 లక్షల మంది యూఎస్‌లో చదువుకుంటున్నారు. అంటే.. అగ్రరాజ్యం స్థానాన్ని కెనడా అక్రమించిదన్నమాట. అమెరికా తర్వాత ఆస్ట్రేలియా(92,383), బ్రిటన్(55,465), న్యూజిలాండ్(30వేలు), చైనా(23వేలు) ఉన్నాయి. ఇక కెనడాలో భారత విద్యార్థుల సంఖ్య సంవత్సరాల వారిగా చూసుకుంటే క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2017లో 82,990 మంది ఉంటే.. 2018లో 1,07,175, 2019లో 1,39,740, 2021లో 2,15,720. అదే ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు గణాంకాలు.. 2017లో 5,53,400, 2018లో 7,52,725, 2021లో 11,33,749గా ఉన్నాయి.


అమెరికాను కాదని కెనడా వైపు వెళ్లడానికి కారణమిదే..

అగ్రరాజ్యాన్ని కాదని భారత విద్యార్థులు కెనడాకు తరలిపోవడానికి ప్రధానం కారణం అమెరికా వీసా విధానాలేనని చెప్పాలి. వీసాల జారీని కఠినతరం చేయడం, ఉపాధి ఆధారిత హెచ్-1బీతో పాటు ఇతర వీసాల్లో మార్పులు చోటు చేసుకోవడం, మన విద్యార్థులపై అక్కడి పోలీసుల నిఘా వంటి కారణాలు భారత విద్యార్థులను అమెరికాకు దూరం చేశాయి. అదే సమయంలో కెనడా విదేశీ విద్యార్థులను ఆకర్షించే విధంగా స్టూడెంట్ వీసాలను జారీని సులభతరం చేయడంతో పాటు పలు వెసులుబాటులు కల్పించింది. ఒక్క ఏడాది కోర్సుకు రెండేళ్ల వర్క్ పర్మిట్, రెండేళ్ల పీజీ కోర్సుకు మూడేళ్ల పాటు వర్క్ పర్మిట్ ఇవ్వడం చేస్తోంది.


అలాగే కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు నుంచి మూడేళ్లలోనే వచ్చేస్తుంది. ఇలా వీసా విధానంలో పలు కీలక మార్పులు చేయడంతో భారతీయ విద్యార్థులు కెనడాకు క్యూ కడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక అమెరికా కంటే 30 శాతం వరకు ఫీజులు, ఖర్చులు తక్కువగా ఉండడంతో మన విద్యార్థులు కెనడాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాలకు తరలిపోతున్నారు. 

Updated Date - 2021-07-27T14:29:14+05:30 IST