Russia- Ukraine ఉద్రిక్తతలు: సాయం కోసం 20 వేల మంది భారతీయుల ఎదురుచూపు..!

ABN , First Publish Date - 2022-02-14T23:44:29+05:30 IST

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలో ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతోన్న భారతీయ విద్యార్థులు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారందరినీ వెనక్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నేత చర్మేశ్ శర్మ రాష్ట్రపతి కార్యలయంలో లిఖిపూర్వక అభ్యర్థన దాఖలు చేశారు.

Russia- Ukraine ఉద్రిక్తతలు:  సాయం కోసం 20 వేల మంది భారతీయుల ఎదురుచూపు..!

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ విషయంలో రష్యా, నాటో(NATO) దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతోన్న భారతీయ విద్యార్థులు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారందరినీ వెనక్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నేత చర్మేశ్ శర్మ రాష్ట్రపతి కార్యలయంలో పిటిషన్ దాఖలు చేశారు. 


దేశంలో  వివిధ రాష్ట్రాల నుంచి 18 నుంచి 20 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని చర్మేశ్ శర్మ తన అర్జీలో పేర్కొన్నారు.   రష్యా సైన్యాల మోహరింపు కారణంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో  యుద్ధవాతావరణం నెలకొనగా.. భారతీయ విద్యార్థుల్లో అధిక శాతం పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు అధికసంఖ్యలో ఉన్నారని సమాచారం. 


భారత్‌లో మెడికల్ సీటు సంపాదించడం చాలా కష్టమని ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు అనేక మంది అభిప్రాయపడ్డారు. దేశంలో కేవలం 88 వేల మెడికల్ సీట్లు ఉండగా.. ఏటా 8 లక్షల మంది ఎంట్రన్స్ పరీక్షలకు హాజరువుతన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితితో పోలిస్తే ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదవడం చాలా సులువని, అక్కడి కాలేజీల్లో సీట్లు సులభంగా లభిస్తాయని అనేక మంది అభిప్రాయపడ్డారు. 


అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల చర్చలు..

రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదొమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో చర్చించారు. ఈ ఉద్రిక్తత తొలగించేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగించాలని ఇరు నేతలు అంగీకరించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని బైడెన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రష్యా దాడికి దిగే పక్షంలో అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాకు దీటుగా జావాబిస్తాయని స్పష్టం చేశారు. 


ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చు...

రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వద్ద జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న జేక్ సల్లివన్ ఆదివారం హెచ్చరించారు. ఉక్రెయిన్  సరిహద్దు వద్ద రష్యా సైన్యాల మోహరింపు, సైనిక విన్యాసాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి తోసిపుచ్చారు. అమెరికా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారికి ఇది అలవాటేనంటూ మండిపడ్డారు. కాగా.. ఇప్పటికే ఉక్రెయిన్‌కు వేళ్లాల్సిన అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దైపోయాయి. అనేక దేశాలు తమ రాయబార కార్యాలయాల్లోని సిబ్బందిని వెనక్కు రప్పించుకున్నాయి. స్వదేశానికి వచ్చేయాలంటూ అమెరికా, బ్రిటన్, నార్వే, జపాన్, లాట్వియా, డెన్మార్క్ దేశాల ప్రభుత్వాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులకు సూచించాయి.

Updated Date - 2022-02-14T23:44:29+05:30 IST