భారత ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రవాసుల హర్షం!

ABN , First Publish Date - 2021-07-29T01:54:00+05:30 IST

నీట్ పరీక్ష కేంద్రం విషయంలో భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని కువైత్‌లోని ప్రవాస భారతీయులు స్వాగతించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దే

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రవాసుల హర్షం!

కువైత్: నీట్ పరీక్ష కేంద్రం విషయంలో భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని కువైత్‌లోని ప్రవాస భారతీయులు స్వాగతించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి  ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఏటా నీట్ (నేషనల్ ఎలిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా హాజరవుతుంటారు. అయితే కువైత్‌లోని విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి భారతీయ విద్యార్థుల కోసం దేశం బయట కువైత్‌లో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. 



నీట్ పరీక్షకు హాజరవ్వడం కోసం విద్యార్థులు ఇండియాకు రావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ ప్రకటన పట్ల కువైత్‌లోని భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇండియన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన ‘నీట్ డే’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి మాట్లాడారు. కువైత్‌లోని భారత విద్యార్థుల, ప్రవాసుల సమస్యలను పరిష్కరించడంపై భారత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. కువైత్‌లో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2021-07-29T01:54:00+05:30 IST