పాక్ యువతికి భారతీయుడి సాయం

ABN , First Publish Date - 2022-03-06T22:52:21+05:30 IST

రష్యా దాడి నేపథ్యంలో, ఉక్రెయిన్‌లోని భయానక పరిస్థితుల్లోనూ మానవత్వం చాటుకుంటున్నారు చాలామంది. తోటివాళ్లకు వీలైనంత సాయం అందిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి ఒకరు పాకిస్తాన్ యువతికి సాయం చేశాడు.

పాక్ యువతికి భారతీయుడి సాయం

న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో, ఉక్రెయిన్‌లోని భయానక పరిస్థితుల్లోనూ మానవత్వం చాటుకుంటున్నారు చాలామంది. తోటివాళ్లకు వీలైనంత సాయం అందిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి ఒకరు పాకిస్తాన్ యువతికి సాయం చేశాడు. ఆమె స్వదేశం వెళ్లడానికి అవసరమైన సహాయం చేసి మానవత్వం చాటుకున్నాడు. అంకిత్ యాదవ్ అనే భారతీయ విద్యార్థి ఈమధ్యే ఉక్రెయిన్ నుంచి ఇండియా తిరిగొచ్చాడు. యుద్ధం నేపథ్యంలో అక్కడున్న పరిస్థితుల్ని వివరించాడు. ఒంటరిగా మిగిలిపోయి, స్వదేశానికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న పాక్ యువతికి సాయం చేసినట్లు చెప్పాడు. అంకిత్ తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధం నేపథ్యంలో గత నెల 24 నుంచి కీవ్‌లో చాలా మంది బంకర్లలోనే దాక్కున్నారు. అంకిత్ కూడా స్థానికులతోపాటు ఒక బంకర్‌లో దాక్కున్నాడు. అదే బంకర్‌లో పాకిస్తాన్‌కు చెందిన యువతి కూడా ఉంది. ఉక్రెనియన్లు కాకుండా ఆ బంకర్‌లో ఇండియా, పాక్‌ల నుంచి ఉన్నది వీరిద్దరే. అక్కడే ఆ యువతి తన పరిస్థితి, అంకిత్‌కు వివరించింది. తాను తప్ప, పాకిస్తాన్ నుంచి వేరెవరూ లేరని, తన దేశం ఎలా వెళ్లాలో తెలియడం లేదని ఆ యువతి చెప్పింది. దీంతో ఆమెకు వీలైనంత సాయం చేయాలని అంకిత్ నిర్ణయించుకున్నాడు.


ఇదే క్రమంలో ఒకరోజు ఇద్దరికీ ఆహారం సరిపోకపోతే, అంకిత్ దగ్గర్లో ఉన్న హాస్టల్‌కు వెళ్లి వంట చేసి తీసుకొచ్చాడు. తర్వాత 28వ తేదీన బంకర్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో పాక్ ఎంబసీ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అంకిత్‌తో కూడా మాట్లాడిన పాక్ ఎంబసీ అధికారులు, ఒంటరిగా ఉన్న ఆ యువతి సరిహద్దు చేరేవరకు సాయం చేయాలని కోరారు. దీంతో అంకిత్, తనతోపాటు ఆమెను తీసుకుని ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అక్కడికి వెళ్లాక మూడు రైళ్లలో చోటు దొరకలేదు. చివరికి ఎలాగోలా మరో రైలులో చోటు దక్కించుకుని ఇద్దరూ ప్రయాణిస్తుండగా, ఆ రైలులో ఒకవైపు పేలుడు జరిగింది. అలాంటి భయానక పరిస్థితుల్లోనే, ట్రైన్ చాలా నెమ్మదిగా స్టేషన్ చేరుకుంది. అక్కడ ఆమెలాంటి వాళ్ల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది పాక్ ఎంబసీ. పాకిస్తానీలు ఉన్న ఆ బస్సు వరకు ఆమెను క్షేమంగా చేర్చినట్లు అంకిత్ తెలిపాడు. 

Updated Date - 2022-03-06T22:52:21+05:30 IST