2021-22 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన స్టాక్ మార్కెట్ సంపద ఇది..
సెన్సెక్స్, నిఫ్టీ 18 శాతానికి పైగా వృద్ధి
9 నెలలు జోరు.. చివరి 3 నెలలు డీలా
ముంబై: ఈ మార్చి 31తో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 18 శాతానికి పైగా పుంజుకున్నాయి. గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్ 9,059.36 పాయింట్లు (18.29 శాతం) లాభపడగా.. నిఫ్టీ 2,774.05 పాయింట్లు (18.88 శాతం) పెరిగింది. బ్లూచి్‌పలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు అధిక రిటర్నులు పంచాయి. బీఎ స్ఈ మిడ్‌క్యాప్-100, స్మాల్‌క్యాప్-100 సూచీలు 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడంతో పాటు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ధరాఘాతం ఆందోళనకర స్థాయికి పెరిగిన నేపథ్యంలోనూ మన ఈక్విటీ మార్కెట్ భారీగా పుంజుకోవడం గమనార్హం. 2021-22లో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ సంపద (క్యాపిటలైజేషన్) రూ.59,75,686.84 కోట్లు పెరిగి రూ.264,06,501.38 కోట్లకు చేరుకుంది. కరోనా ఆంక్షల తగ్గుముఖంతో ఆర్థిక వ్యవస్థతోపాటు కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు పునరుద్ధరణ బాట పట్టడంతో ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలపాటు మార్కెట్లో జోరు కొనసాగిందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ విభాగ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు.
అమెరికా వడ్డీ రేట్ల పెంపు భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ధరలు వంటి ప్రతికూలతలు గడిచిన మూడు నెలల్లో మార్కెట్‌కు భారీగా గండికొట్టాయని, లేదంటే సూచీలు మరింత మెరుగైన రిటర్నులు పంచి ఉండేవన్నారు. మరిన్ని విశేషాలు..
ఈ ఏడాది జనవరి 17న బీఎ్‌సఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.280 లక్షల కోట్లకు పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది.
గత ఏడాది అక్టోబరు 19న బీఎ్‌సఈ సెన్సెక్స్ 62,245.43 వద్ద, నిఫ్టీ 18,604.45 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిలను రికార్డు చేసుకున్నాయి.
ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.42 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
రూ.17.81 లక్షల కోట్ల మార్కెట్ సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానాన్ని కొనసాగించింది. టీసీఎ్‌స (రూ.13.83 లక్షల కోట్లు), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ (రూ.8.15 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.8.02 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.5.07 లక్షల కోట్లు) టాప్ ఫైవ్ జాబితాలో ఉన్నాయి.
నష్టాలతో ముగింపు
ప్రామాణిక ఈక్విటీ సూచీలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి నష్టాలతో ముగింపు పలికాయి. గురువారం ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెస్సెక్స్ 115.48 పాయింట్లు కోల్పోయి 58,568.51 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 33.50 పాయింట్లు క్షీణించి 17,464.75 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.46 శాతం నష్టపోయి సెన్సెక్స్ టాప్ లూజర్‌గా మిగిలింది. విప్రో, డాక్టర్ రెడ్డీస్ సైతం ఒక శాతానికి పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి.
బక్కచిక్కిన రూపాయి
గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశీయ కరెన్సీ మరింత బక్కచిక్కింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 3.61 శాతం (264 పైసలు) క్షీణించింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం మాత్రం డాలర్‌తో రూపాయి మారకం రేటు 14 పైసలు బలపడి రూ.75.76 వద్ద స్థిరపడింది.
ఈ ఏడాది 67,000కు సెన్సెక్స్!?
గడిచిన కొన్ని నెలల్లో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీగా దిద్దుబాటుకు లోనైనప్పటికీ, మార్కెట్ ఇంకా దీర్ఘకాలిక బుల్ ట్రెండ్‌లో ఉందని విశ్లేషకులు అంటున్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లాగే 2022-23లోనూ సూచీలు రెండంకెల స్థాయి రిటర్నులు పంచడంతో పాటు సరికొత్త శిఖరాలకు చేరుకోనున్నాయని వారు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ దాదాపు అన్ని రకాల అవరోధాలను సమర్థవంతంగా అధిగమించగలిగిందని స్వస్తిక ఇన్వె్స్టమార్ట్ ఎండీ సునీల్ న్యాతీ అన్నారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లు మళ్లీ పుంజుకోవచ్చన్నారు. అయితే, అధిక ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు మాత్రం మార్కెట్లో స్వల్పకాలిక ఒడుదుడుకులకు కారణం కావచ్చన్నారు. కరోనా సంక్షోభ ముప్పు కూడా పూర్తిగా తొలగలేదని, మరిన్ని దశల్లో వ్యాప్తి మార్కెట్ పురోగతికి అడ్డుకట్టగా మారే అవకాశాలున్నాయని సునీల్ పేర్కొన్నారు.