Video: రక్తం గడ్డ కట్టే చలిలో దేశ రక్షణకు సైనికులు ఇలా..

ABN , First Publish Date - 2022-01-08T20:14:40+05:30 IST

సైనికులు దేశ రక్షణకే పెద్ద పీట వేస్తారు. దృఢ నిశ్చయంతో, కర్తవ్య దీక్షతో

Video: రక్తం గడ్డ కట్టే చలిలో దేశ రక్షణకు సైనికులు ఇలా..

న్యూఢిల్లీ : సైనికులు దేశ రక్షణకే పెద్ద పీట వేస్తారు. దృఢ నిశ్చయంతో, కర్తవ్య దీక్షతో దేశాన్ని కాపాడతారు. ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు. రక్షణ శాఖ విడుదల చేసిన ఫొటోలు వారి అంకిత భావం గురించి తెలుసుకోవడానికి ఓ మచ్చు తునకగా ఉపయోగపడతాయి.


ఉత్తరాది మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయి. హిమాలయాల గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉన్నాయి. రక్తం గడ్డ కట్టి, చావు తప్పదనే విధంగా ఉంది పరిస్థితి. అయినా భరత మాత ముద్దుబిడ్డలైన సైనికులు మొక్కవోని దీక్షతో నిరంతరం సరిహద్దులను కాపాడుతున్నారు. దేశ సేవ కోసం సడలని పట్టుదలతో పని చేస్తున్నారు. 




భారత సైన్యం నిర్వహిస్తున్న కార్యకలాపాలను, వారి దేశ భక్తిని ప్రతిబింబించే వీడియోలను భారత దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఉధంపూర్ ప్రజా సంబంధాల అధికారి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో విధులను ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఈ వీడియోలలో చూపించారు. 


అప్రమత్తంగా ఉన్న ఓ సైనికుడు చలిని తట్టుకునే దుస్తులను ధరించి, సరిహద్దులపై డేగ కన్నుతో నిఘా పెట్టడం ఓ వీడియోలో కనిపిస్తోంది. గడ్డ కట్టించే చలి గాలులకు ఎదురు నిలిచి ఆ సైనికుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుండటం కనిపిస్తోంది. చిన్న చిన్న ఆశలు కానీ, అబద్ధాలు కానీ మనల్ని గమ్యానికి చేర్చబోవని, శరీరం, మనసు, దృఢ నిశ్చయంతో కూడిన దృఢ సంకల్పం మాత్రమే గమ్యాన్ని చేర్చుతుందని పేర్కొన్నారు. అందరికీ ఒకటే లక్ష్యం ఉందన్నారు. త్యాగం చేయడానికి మనకు ఉన్నది ఒకటే జీవితమని, స్వాతంత్ర్యాన్ని కోల్పోతే నిలిచేదెవరని ఈ వీడియో క్రింద ఇచ్చిన ట్వీట్‌లో పీఆర్ఓ ప్రశ్నించారు. 


దట్టమైన మంచుతో నిండిన పర్వతంపై గస్తీ తిరుగుతూ సరిహద్దు ప్రాంతాలను కాపాడుతున్న సైనికులు మరో వీడియోలో కనిపిస్తున్నారు. ‘‘పార్కులో ఉదయాన్నే మీరు చేసే వాకింగ్‌తో దీనిని పోల్చుకోండి’’ అని పీఆర్ఓ ట్వీట్ చేశారు. 





ఈ వీడియోలపై ట్విటరాటీలు స్పందిస్తూ, సైనికులే తమ హీరోలని పేర్కొన్నారు. యూనిఫాం ధరించిన ఈ వ్యక్తులు సముద్రాన్ని మరిగించగలరని ఓ యూజర్ పేర్కొన్నారు. అందుకే వారు వారిలా ఉన్నారన్నారు. సూపర్‌పవర్ అనేది మిథ్య కాదన్నారు. మంచు, వర్షం, తుపాను వంటివాటిని సూపర్‌హ్యూమన్ కాక ఎవరు తట్టుకోగలరని ప్రశ్నించారు. వీరు హింసతో హింసాత్మకంగా పోరాడుతున్నారు కాబట్టే మనం నిద్రపోగలుగుతున్నామన్నారు. 


2020 మే నుంచి చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతుండటం వల్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి హిమాలయాల వద్ద భద్రతను భారత ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. రక్షణ దళాలను పెంచింది. 

Updated Date - 2022-01-08T20:14:40+05:30 IST