‘బాలా’ బాటలో మరెందరో..

ABN , First Publish Date - 2020-06-29T08:52:02+05:30 IST

దేశంలో సాకర్‌కు ఇప్పుడు ఆదరణ లభిస్తోందనీ, ఈ క్రీడలో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుండడం మరింత సంతోషంగా ఉందని జాతీయ మహిళల ఫుట్‌బాల్‌ ...

‘బాలా’ బాటలో మరెందరో..

విదేశీ లీగ్‌లు ఆడే స్థాయిలో ఉన్నాం

భారత సాకర్‌ జట్టు 

గోల్‌కీపర్‌ అదితి చౌహాన్‌


న్యూఢిల్లీ: దేశంలో సాకర్‌కు ఇప్పుడు ఆదరణ లభిస్తోందనీ, ఈ క్రీడలో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుండడం మరింత సంతోషంగా ఉందని జాతీయ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు గోల్‌కీపర్‌ అదితి చౌహాన్‌ అంటోంది. ఇప్పటిదాకా జాతీయస్థాయికే పరిమితమైన మన మహిళల ఫుట్‌బాల్‌.. ఇప్పుడు ప్రొఫెషనల్‌ ప్లేయర్లుగా అంతర్జాతీయ క్లబ్‌లకు ఆడే స్థాయికి ఎదిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇటీవల మన జాతీయ జట్టు స్ట్రయికర్‌ బాలా దేవి ఓ విదేశీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడమే అందుకు నిదర్శనమని అదితి ఉదహరించింది. ఇకనుంచి దేశంలో మరెందరో యువ క్రీడాకారిణులు.. బాలాదేవి బాటలో నడుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. టీమిండియా మహిళల జట్టు స్ట్రయికర్‌గా అద్భుత ప్రతిభ చూపుతున్న బాలా దేవి.. గతేడాది ఐరోపాలో ప్రముఖ ప్రొఫెషనల్‌ లీగ్‌ ఆడిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఆమె స్కాట్లాండ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గ్లాస్గోకు చెందిన రేంజర్స్‌ క్లబ్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.


వచ్చే ఏడాది ఫిఫా అండర్‌-17 వరల్డ్‌కప్‌, ఏఎ్‌ఫసీ ఆసియాకప్‌-2022 టోర్నీలు భారత్‌లో జరగనున్న నేపథ్యంలో ఇక్కడ మహిళల ఫుట్‌బాల్‌కు  క్రేజ్‌ మరింత పెరిగే అవకాశముందని చౌహాన్‌ తెలిపింది. ‘దేశంలో ఎంతో ప్రతిభ ఉంది. ఎక్కువ మంది అమ్మాయిలకు విదేశీ క్లబ్‌ల అనుభవం అవసరం. ఇప్పుడు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎంతో మంది బాలాదేవి అడుగుజాడల్లో నడుస్తారు. ఆమె స్ఫూర్తితో ఇకనుంచి భారత్‌లో మహిళల ఫుట్‌బాల్‌ మరోస్థాయికి వెళుతుందన్న విశ్వాసం ఉంది’ అని చౌహాన్‌ వ్యాఖ్యానించింది. 27 ఏళ్ల చౌహాన్‌ కూడా యూకేలో చదువుకొనే సమయంలో లండన్‌కు చెందిన వెస్ట్‌ హామ్‌ లేడీస్‌ తరఫున పెద్దగా గుర్తింపులేని లీగ్‌లు ఆడింది. అయితే యూర్‌పలో సాకర్‌ ప్రమాణాలు, ఆట సంస్కృతి వేరుగా ఉంటాయని ఆమె పేర్కొంది. ఒకప్పుడు భారత జట్టులో నార్త్‌ఈస్ట్‌ ప్లేయర్లే ఎక్కువగా ఉండేవారనీ.. ఇప్పుడు మిగతా రాష్ట్రాల క్రీడాకారిణుల ప్రాతినిథ్యం కూడా పెరిగిందని తెలిపింది. ఢిల్లీకి చెందిన అదితి.. తొలుత కరాటే, బాస్కెట్‌బాల్‌పై మక్కువ చూపింది. అయితే, కోచ్‌ సలహా మేరకు పుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆమె.. 15 ఏళ్ల వయసులో ఢిల్లీ అండర్‌-19 జట్టుకు ఎంపికైంది. 2012లో శ్రీలంక వేదికగా జరిగిన శాఫ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన అదితి.. ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రతిభ చాటుతూ జాతీయ జట్టులో ఉత్తమ గోల్‌కీపర్‌గా చోటు పదిలం చేసుకుంది.


ఎవరీ బాలాదేవి?

ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా ఎదిగిన తొలి భారత క్రీడాకారిణిగా మణిపూర్‌కు చెందిన బాలా దేవి రికార్డులకెక్కింది. కొన్నేళ్లుగా జాతీయ జట్టులో స్ట్రయికర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చూపుతున్న బాలాతో ఈ ఏడాది ఆరంభంలో స్కాట్లాండ్‌కు చెందిన రేంజర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఒప్పందం కుదుర్చుకొంది. కాంట్రాక్టు ప్రకారం ఆమె 18 నెలల పాటు ఆ క్లబ్‌కు ఆడాల్సి ఉంటుంది. ఇలా అత్యున్నతమైన విదేశీ క్లబ్‌కు ఆడుతున్న తొలి ఆసియా ఫుట్‌బాలర్‌గా 27 ఏళ్ల  బాల చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున దేవి అత్యధికంగా 58 మ్యాచ్‌ల్లో 52 గోల్స్‌ చేసింది. 

Updated Date - 2020-06-29T08:52:02+05:30 IST