ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలే ముఖ్యం

ABN , First Publish Date - 2021-06-04T09:19:09+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే స్తంభించిందని.. ఏడాదిన్నరగా ఆటగాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రాణాలే ముఖ్యం

పీవీ సింధు


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే స్తంభించిందని.. ఏడాదిన్నరగా ఆటగాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికీ కదల్లేకపోతున్నామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ప్రాణాలే ముఖ్యమ’ని ఎంతో ఆవేదనతో చెప్పింది. శిక్షణ కోసం బయటికి వెళ్లి వచ్చే తమ ద్వారా ఇంట్లోని పెద్దవారికి  కరోనా ప్రమాదం పొంచివుంటుందని, దీనిద్వారా ఆటగాళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది.


ఇక ఒలింపిక్స్‌ కోసం ప్రత్యర్థులకు ఝలక్‌ ఇవ్వడానికి సరికొత్త టెక్నిక్‌లను నేర్చుకొంటున్నట్టు సింధు పేర్కొంది. ఒక రకంగా కరోనా కారణంగా బ్రేక్‌ రావడం వల్ల తన తప్పులను సరిదిద్దుకోవడానికి సమయం లభించిందని చెప్పుకొచ్చింది. కాగా, గాయం కారణంగా తన చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్‌ చాంప్‌ కరోలినా మారిన్‌ ఒలింపిక్స్‌ నుంచి వైదొలగడంపై సింధు సానుభూతి వ్యక్తం చేసింది. కానీ, మారిన్‌ లేకపోయినా పోటీ ఏమాత్రం తగ్గదని చెప్పింది. 


ఎదురుదాడే..ఆయుధం:

అలుపులేకుండా ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే తన ఆట తీరని సింధు పేర్కొంది. ‘ఎదురుదాడే నా బలమని ప్రత్యర్థులకు తెలుసు. అందుకే డిఫెన్స్‌ను మరింతగా మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తున్నా. అన్ని రకాల షాట్లను ఆడే విధంగా సాధన చేస్తున్నాన’ని తెలిపింది. సహచరులు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌లు విశ్వక్రీడలకు క్వాలిఫై కాకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. గచ్చిబౌలి స్టేడియంలో కొరియా కోచ్‌ పార్క్‌ టే సంగ్‌ పర్యవేక్షణలో సింధు శిక్షణ పొందుతోంది. అక్కడ ఆడితే మెగా ఈవెంట్‌లో ఆడే అనుభూతి కలుగుతుందని ఆమె పేర్కొంది. మానసిక కారణాలతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొన్న టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాకా పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. మీడియా సమావేశాల్లో తనకెన్నడూ ఇబ్బందులు ఎదురుకాలేదని సింధు చెప్పింది. 

Updated Date - 2021-06-04T09:19:09+05:30 IST