అరుణగ్రహంపై వేలాది దారులు.. గుర్తించిన భారత శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2022-01-25T22:48:38+05:30 IST

భూగ్రహానికి ఆవల జీవం ఉనికి కోసం మానవుల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా భూమిని పోలిన అంగారక గ్రహంపై..

అరుణగ్రహంపై వేలాది దారులు.. గుర్తించిన భారత శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: భూగ్రహానికి ఆవల జీవం ఉనికి కోసం మానవుల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా భూమిని పోలిన అంగారక గ్రహంపై జీవం ఉండొచ్చన్ని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. ఈ దిశగా ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు రోవర్లు మార్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు మార్స్‌పై బండరాళ్లు దొర్లిన వేలాది ట్రాక్‌లను గుర్తించారు.


మార్స్‌పై ఇటీవలే ఈ చర్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో మార్స్‌పై కాలనీలు నిర్మించాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకు మార్స్‌పై కనిపించిన తాజా కదలికలు మరింత ప్రేరణ ఇస్తున్నాయి. మార్స్ ‘ప్రస్తుతం క్రియాశీలంగా ఉంది’’ అని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ప్లానెటరీ సైన్స్ డివిజన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విజయన్ పేర్కొన్నారు. 


జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో గత నెలలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ బండరాయి ట్రాక్‌లు అదృశ్యం కావడానికి రెండు నుంచి నాలుగు మార్షియన్ సంవత్సరాలు (నాలుగు నుంచి 8 సంవత్సరాలు) పడుతుంది. గ్రహ ఉపరితలాలపై ఇటీవలి ఉపరితల ప్రక్రియలను గుర్తించడానికి ఈ ఎజెక్షన్‌లు, ట్రాక్‌లను ఉపయోగించవచ్చు.


ఈ బండరాళ్ల ట్రాక్‌పై డాక్టర్ విజయన్ మాట్లాడుతూ.. ఈ ట్రాక్‌లు దశాబ్దం క్రితం నాటివి కావచ్చని అంచనా వేశారు. వాటిలో కొన్ని కొత్తవి కూడా ఉన్నట్టు చెప్పారు.  ఈ ట్రాక్‌లు అదృశ్యం కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అయితే, తాము గుర్తించినవి మాత్రం చాలా కొత్తవని తెలుస్తోందని అన్నారు.    

Updated Date - 2022-01-25T22:48:38+05:30 IST