ఆర్బీఐ ప్రకటనతో కదం తొక్కిన రూపాయి...!

ABN , First Publish Date - 2020-03-27T19:01:29+05:30 IST

కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తీసుకున్న పలు..

ఆర్బీఐ ప్రకటనతో కదం తొక్కిన రూపాయి...!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తీసుకున్న పలు కీలక నిర్ణయాల ఫలితంగా రూపాయి విలువ భారీగా పుంజుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో డాలర్‌‌తో రూపాయి మారకం విలువ 81 పైసలు బలపడి రూ. 74.35కు చేరుకుంది.  శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వడ్డీ రేట్లపై పలు నిర్ణయాలను వెల్లడించారు.  రెపోరేటును 75 బేసిస్‌ పాయింట్లు, రివర్స్‌ రెపోరేటు 90 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4.4 శాతానికి, రివర్స్ రెపో రేటు 4.4 శాతానికి తగ్గిందన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైతే మరిన్న చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ హామీ ఇచ్చారు.


ఈ నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలను ఫోరెక్స్ ట్రేడర్లు స్వాగతించారు. తాజా ప్రకటనతో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఉదయం నుంచే ఆర్బీఐ ప్రకటన సానుకూలంగా ఉంటుందన్న అంచనాలతో రూపాయి 74.60 వద్ద లాభాలతో ప్రారంభమైంది. చూస్తుండగానే  81 పైసల మేర డాలర్‌పై పట్టుసాధించి 74.35కు పుంజుకుంది. కాగా  గురువారం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 75.16 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-03-27T19:01:29+05:30 IST