అబుధాబి: కరోనా నేపథ్యంలో యూఏఈలోని భారత మిషన్ తొలిసారి వర్చువల్ పద్ధతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించింది. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కేవలం అధికారులు, ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. కాన్సుల్ జనరల్ అమన్ పూరి కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురువేశారు. యూఏఈ పర్యటనలో ఉన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రామ్‌దాస్ అథవాలే కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే అబుధాబిలోని ఇండియన్ ఎంబసీలో భారత రాయబారి పవన్ కపూర్ జెండా ఎగురువేశారు. ఇక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నాడు అమన్ పూరి ప్రత్యేక వీడియో సందేశం ఇచ్చారు. యూఏఈలోని భారతీయులతో పాటు ఎమిరటీలు, సుమారు 200 దేశాల పౌరులకు పూరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 30 లక్షలకు పైగా మంది భారతీయ సమాజానికి ఆశ్రయం, ఉపాధి ఇచ్చిన యూఏఈ నాయకత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.