దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్ళి బాలుడిని కాపాడిన ఉద్యోగికి బహుమతులు

ABN , First Publish Date - 2021-04-21T17:53:47+05:30 IST

సుశిక్షితులైన సైనికులు చేయగలిగిన సాహసం చేసి ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన

దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్ళి బాలుడిని కాపాడిన ఉద్యోగికి బహుమతులు

న్యూఢిల్లీ : సుశిక్షితులైన సైనికులు చేయగలిగిన సాహసం చేసి ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగికి రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతి ప్రకటించింది. ఓ నిండు ప్రాణాన్ని కాపాడినందుకు ప్రశంసించింది. మరోవైపు ఆయనకు క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా కూడా మరొక బహుమతిని ప్రకటించారు. ఆయన హీరోయిజం ప్రదర్శించారని అభినందించారు. 


సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నదాని ప్రకారం, థానేలోని వాంగని రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ ఏప్రిల్ 17న ఓ బాలుడిని ఎత్తుకుని రైలు పట్టాలపై నడుస్తున్నారు. వేగంగా ఓ రైలు దూసుకొస్తోంది. అదే సమయంలో ఆమె చేతిలోని బాలుడు జారిపోయి రైలు పట్టాలపై పడిపోయాడు. అక్కడే పాయింట్స్‌మన్‌గా పని చేస్తున్న మయూర్ షెల్కే ఆ బాలుడిని గమనించారు. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటంపైనే ఆయన దృష్టి ఉంది. ఆయన తన ప్రాణాలను సైతం పట్టించుకోలేదు. బాలుడు పట్టాలపై పడిపోయి, ఎత్తయిన ప్లాట్‌ఫాంపైకి ఎక్కేందుకు చాలా శ్రమిస్తున్న విషయాన్ని గమనిస్తూ, ఆ బాలుడివైపు, తనవైపు దూసుకొస్తున్న రైలును లెక్క చేయకుండా, అత్యంత వేగంగా దూసుకెళ్ళారు. ఆ బాలుడిని ముందుగా ఒడ్డుకు చేర్చి, ఆ తర్వాత తాను బయటికి వచ్చారు. వెంట్రుకవాసిలోనే ఇరువురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరుక్షణమే రైలు వేగంగా దూసుకెళ్ళింది. ఈ సంఘటనను సామాజిక మాధ్యమాల్లో చూసినవారంతా మయూర్ షెల్కేను అభినందిస్తున్నారు. 


సమయోచితంగా వ్యవహరించి, బాలుడిని కాపాడినందుకు సెంట్రల్ రైల్వే ఉద్యోగి అయిన మయూర్ షెల్కేను రైల్వే మంత్రిత్వ శాఖ అభినందించింది. ఆయనకు రూ.50 వేలు బహుమతిగా ప్రకటించింది. ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి, బాలుడిని కాపాడారని ప్రశంసించింది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా మయూర్ షెల్కే సాహసోపేత చర్యను ఓ ట్వీట్ ద్వారా ప్రశంసించారు. యావత్తు రైల్వే మంత్రిత్వ శాఖ ఆయనను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు. 


బహుమతిగా జావా మోటార్‌ సైకిల్‌ 

క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా మాట్లాడుతూ, మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమని చెప్పారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందన్నారు. ఆయనకు జావా మోటార్‌ సైకిల్‌ను బహుమతిగా ఇస్తామని చెప్పారు. ఆయనలో ఓ లెజెండ్‌కు ఉండే సత్తా ఉందన్నారు. 


Updated Date - 2021-04-21T17:53:47+05:30 IST