2500 బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే

ABN , First Publish Date - 2020-04-06T23:47:44+05:30 IST

దేశంలో రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కునేలా రైల్వే శాఖ సైతం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో...

2500 బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కునేలా రైల్వే శాఖ సైతం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 2500 బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలిచినట్టు ప్రకటించింది. వీటిలో 4 వేల మందికి పైగా కరోనా రోగులకు చికిత్స అందించవచ్చునని వెల్లడించింది. నాన్ ఏసీ రైళ్లలోని 5 వేల బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మలిచేందుకు సంకల్పించిన  రైల్వేశాఖ .. రోజుకు సరాసరిన 375 బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్చుతున్నట్టు తెలిపింది. ‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో అందుబాటులో ఉన్న కొద్ది మంది సిబ్బందితో, అతి తక్కువ కాలంలో అనేక బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలచగలిగాం. ఇందుకోసం రైల్వే శాఖలోని వివిధ జోన్లన్నీ కలిసి ఎంతో వివేకంగా, రొటేషన్ పద్ధతిలో అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలిగాం..’’ అని రైల్వేశాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది.


దేశంలో 133 ప్రాంతాల్లో  ఈ పనులు జరుగుతున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. ప్రతి కోచ్‌లోనూ విడివిడిగా 10 మంది రోగులకు చికిత్స అందించే సౌకర్యం ఉంది.  పేషెంట్ క్యాబిన్లను తయారు చేసేందుకు ఒక వైపు మధ్య బెర్త్‌‌తో పాటు పేషెంటుకు ఎదురుగా ఉండే మూడు బెర్తులను కూడా తొలగించారు. పైకి ఎక్కే అన్ని నిచ్చెనలన్నీ తొలగించారు. ఐసొషన్ వార్డులకు తగ్గట్టుగా బాత్రూంలు, ఇతర ప్రాంతాల్లో కూడా పలు మార్పులు చేశారు. 



Updated Date - 2020-04-06T23:47:44+05:30 IST