UAE లోని భారత ప్రవాసులకు కాన్సులేట్ కీలక సూచన.. గడువు ముగిసిన Passports విషయంలో ఆలస్యం చేస్తే..

ABN , First Publish Date - 2021-10-08T18:58:30+05:30 IST

యూఏఈలోని భారత ప్రవాసులకు దుబాయ్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక సూచన చేసింది.

UAE లోని భారత ప్రవాసులకు కాన్సులేట్ కీలక సూచన.. గడువు ముగిసిన Passports విషయంలో ఆలస్యం చేస్తే..

దుబాయ్: యూఏఈలోని భారత ప్రవాసులకు దుబాయ్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక సూచన చేసింది. పాస్‌పోర్ట్స్ గడువు ముగియడాని కంటే ముందే రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. చాలా మంది గడువు ముగిసిన పాస్‌పోర్టులను చివరి నిమిషంలో పునరుద్ధరించడానికి ప్రయత్నించి సమస్యల్లో పడుతున్నట్లు వెల్లడించింది. కనుక గడువు కంటే ఏడాది ముందు వరకు కూడా రెన్యువ్ చేసుకునే వీలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా కాన్సులేట్ గుర్తు చేసింది. ఈ అవకాశాన్ని ప్రవాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. 


"పాస్‌పోర్ట్ గడువు ముగియడానికి ఏడాది ముందు నుంచే రెన్యువల్ చేస్తున్నాం. చాలామంది ప్రవాసులు పాస్‌పోర్టుల గడువు ముగుస్తుందనగా రెన్యువల్ కోసం వస్తుంటారు. ట్రావెల్ డాక్యుమెంట్ విషయంలో ఈ అలసత్వం పనికిరాదు. ఇలా చివరి నిమిషంలో హడావుడి చేసే కంటే ముందే వాటిని పునరుద్ధరించుకోవడం బెటర్" అని కాన్సుల్‌లోని పాస్‌పోర్ట్, ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన రామ్‌కుమార్ తంగరాజ్ అనే అధికారి చెప్పారు. ఇక పాస్‌పోర్ట్స్ రెన్యువల్ చేసుకోవడంలో ఆలస్యం కారణంగా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందా? అనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దరఖాస్తు దారులు ఎవరైతే పాస్‌పోర్టు రెన్యువల్ కోసం అప్లై చేసుకుంటారో వారికి ఎలాంటి పోలీస్ వెరిఫికేషన్ లేకుండా కేవలం రెండు రోజుల్లోనే కొత్త పాస్‌పోర్ట్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, దరఖాస్తుదారుడి చిరునామా, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పు చేయాల్సి ఉంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. మిగతా ఏ సందర్భంలోనూ వెరిఫికేషన్ ఉండదని ఆయన తెలిపారు.


ఈ మేరకు 2020 సెప్టెంబర్‌లో ఇండియన్ మిషన్ ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కనుక రెన్యువల్ సమయంలో పాస్‌పోర్టులోని వివరాల్లో ఎలాంటి మార్పులు లేకుంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండదన్నారు. ఇక బీఎల్ఎస్ కేంద్రానికి దరఖాస్తు అందిన వెంటనే ప్రాసెస్ మొదలెట్టి, కేవలం రెండు రోజుల్లోనే కొత్త‌ పాస్‌పోర్టు జారీ చేస్తున్నట్లు రామ్‌కుమార్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మాత్రం ఫుజిరహా, రాస్ అల్ ఖైమా వంటి ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తు విషయంలో కాస్తా ఆలస్యం అవుతుందని తెలిపారు. ఇక పోలీస్ వెరిఫికేషన్ అవసరం ఉన్నవాటికి మాత్రం 30 రోజుల సమయం పడుతుందన్నారు. 


దుబాయ్‌లోని భారత ప్రవాసులకు కొత్త డిజైన్లతో పాస్‌పోర్ట్స్..

దుబాయ్‌లోని భారత ప్రవాసులకు మెరుగైన డిజైన్, ప్రత్యేకమైన సెఫ్టీ ఫీచర్లతో ఇండియన్ మిషన్ పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్నట్లు తంగరాజ్ తెలిపారు. 2019లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజైన్‌తో వీటిని ఇస్తున్నామని చెప్పిన ఆయన.. 2021 ప్రారంభం నుంచి ప్రవాసులకు ఈ కొత్త డిజైన్‌తో కూడిన పాస్‌పోర్ట్స్ జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కనుక ప్రవాసులు ఎవరైతే గడువు ముగిసిన పాస్‌పోర్ట్స్ కలిగి ఉన్నారో వారు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా కొత్త ఫీచర్లతో వస్తున్న పాస్‌పోర్ట్స్ పొందవచ్చని తెలిపారు.

Updated Date - 2021-10-08T18:58:30+05:30 IST