స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు

ABN , First Publish Date - 2021-08-14T23:16:53+05:30 IST

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా భారత్

స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు

శ్రీనగర్ : పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా భారత్, పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చి, పుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి జమ్మూ-కశ్మీరులోని వివిధ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైనికులకు భారత్ సైనికులు శుభాకాంక్షలు తెలిపారు. 


భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆగస్టు 14న భారత సైన్యం శుభాకాంక్షలు తెలిపింది. చిలెహానా టిథ్‌వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం స్వీట్లు అందజేసింది. నియంత్రణ రేఖ వెంబడి శాంతి కొనసాగాలనే ఆకాంక్షలను వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యాలు కొనసాగాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. 


ఫిబ్రవరిలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొందని ఈ ప్రకటన పేర్కొంది. శాంతి, సామరస్యాల కోసం భారత సైన్యం చేస్తున్న కృషిని ఈ ప్రాంతంలోని గ్రామస్థులు ప్రశంసిస్తున్నట్లు తెలిపింది. జమ్మూ-కశ్మీరులో శాంతి, అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.


Updated Date - 2021-08-14T23:16:53+05:30 IST