Singapore: 62 ఏళ్ల భారతీయ మహిళకు 20 నెలల జైలు.. ఇంతకు ఆమె చేసిన నేరమేంటంటే..!

ABN , First Publish Date - 2022-03-05T18:20:04+05:30 IST

భారత సంతతికి చెందిన 62 ఏళ్ల ఓ మహిళకు శుక్రవారం సింగపూర్ న్యాయస్థానం 20 నెలల రెండు వారాల జైలు శిక్ష విధించింది.

Singapore: 62 ఏళ్ల భారతీయ మహిళకు 20 నెలల జైలు.. ఇంతకు ఆమె చేసిన నేరమేంటంటే..!

సింగపూర్ సిటీ: భారత సంతతికి చెందిన 62 ఏళ్ల ఓ మహిళకు శుక్రవారం సింగపూర్ న్యాయస్థానం 20 నెలల రెండు వారాల జైలు శిక్ష విధించింది. సింగపూర్‌కు చెందిన ఓ పెద్దాయన నుంచి మోసపూరితంగా 1,13,400 సింగపూర్ డాలర్లు(మన కరెన్సీలో రూ.63.71లక్షలు) కాజేసిన కేసులో భారతీయ మహిళ దేవకి గోపాల్ ముత్తుకు కోర్టు ఈ శిక్ష విధించింది. కోర్టులో పేర్కొన్న  వివరాల ప్రకారం.. 2016లో ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిన సింగపూర్‌కు చెందిన 71 ఏళ్ల ఓ వృద్ధుడితో దేవకికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తన కుమారుడు రాజేశ్వరన్ వీరప్పన్‌ను కూడా ఆ పెద్దాయనకు పరిచయం చేసింది. ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు చిక్కుల్లో పడ్డాయని వాటిని విడిపించేందుకు కొంత నగదు కావాలని తల్లీకుమారుడు ఆ వృద్ధుడిని అడిగారు. 


అలా అతని వద్ద నుంచి పలు దఫాలుగా 1,13,400 సింగపూర్ డాలర్లు అప్పుగా తీసుకున్నారు. కానీ, ఎంతకు తిరిగి ఇవ్వలేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన పెద్దాయన అదే ఏడాది తల్లీకొడుకుపై కోర్టుకెక్కారు. దీంతో 2016లో రాజేశ్వరన్‌కు న్యాయస్థానం 20 నెలల జైలు శిక్ష విధించింది. అయితే, దేవకి మాత్రం అనారోగ్యం సాకుతో ఇన్నాళ్లు తప్పించుకుంది. శుక్రవారం మరోసారి ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు రావడంతో దోషిగా తేలిన దేవకికి న్యాయస్థానం 20 నెలల రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.    

Updated Date - 2022-03-05T18:20:04+05:30 IST