UK: భారత సంతతి వైద్యుడి కీచకపర్వం.. 35 ఏళ్లలో 48 మంది మహిళలపై..

ABN , First Publish Date - 2022-04-15T18:18:53+05:30 IST

బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉండే భారత సంతతి వైద్యుడు కృష్ణ సింగ్(72) తన వద్ద చికిత్స కోసం వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైంది.

UK: భారత సంతతి వైద్యుడి కీచకపర్వం.. 35 ఏళ్లలో 48 మంది మహిళలపై..

లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉండే భారత సంతతి వైద్యుడు కృష్ణ సింగ్(72) తన వద్ద చికిత్స కోసం వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైంది. 1983 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు 35 ఏళ్లలో 48 మంది మహిళలను సింగ్ లైంగికంగా వేధించినట్లు తేలింది. వీటిలో ఎక్కువగా నార్త్ లానార్క్‌షైర్ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేసినప్పుడు చేసినవిగా తేలాయి. మహిళలకు ముద్దులు పెట్టడం, అసభ్యంగా తాకడం, అవసరంలేని టెస్టులు చేయడం, నీచమైన వ్యాఖ్యలు చేయడం లాంటివి చేసినట్లు తేలింది. 2018లో ఓ మహిళ తనపట్ల సింగ్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అతడిపై దర్యాప్తు కొనసాగుతోంది. 


గురువారం ఈ కేసు గ్లాస్గో హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో సింగ్‌పై 60కి పైగా ఆరోపణలు మోపబడ్డాయి. వీటిలో 54 ఆరోపణలో అతడు దోషిగా తేలాడు. కేసును విచారించిన న్యాయమూర్తి శిక్షను వచ్చే నెలకు వాయిదా వేశారు. అలాగే సింగ్ తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలనే షరతుతో బెయిల్‌పై విడుదల చేయడానికి అనుమతించారు. కాగా, సీనియర్ వైద్యుడైన సింగ్‌కు వైద్యరంగంలో మంచి పేరు ఉంది. 'రాయల్ మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్' గౌరవాన్ని కూడా పొందారు. 

Updated Date - 2022-04-15T18:18:53+05:30 IST