Suella Braverman: భారతీయురాలికి కీలక పదవి కట్టబెట్టిన బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్..!

ABN , First Publish Date - 2022-09-07T16:25:09+05:30 IST

బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ (Liz Truss) మంగళవారం తన కొత్త మంత్రిమండలిని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత సంతతి మహిళ సుయేల్లా బ్రావెర్మన్‌ (Suella Braverman)కు కీలక పదవి కట్టబెట్టారు.

Suella Braverman: భారతీయురాలికి కీలక పదవి కట్టబెట్టిన బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్..!

లండన్: బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ (Liz Truss) మంగళవారం తన కొత్త మంత్రిమండలిని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత సంతతి మహిళ సుయేల్లా బ్రావెర్మన్‌ (Suella Braverman)కు కీలక పదవి కట్టబెట్టారు. సుయేల్లాను హోం మంత్రి(సెక్రటరీ)గా నియమించారు. ఇంతకుముందు ఈ పదవిలో భారతీయురాలు ప్రీతి పటేల్ (Priti Patel) కొనసాగారు. బోరిస్‌ జాన్సన్‌  నమ్మినబంటు అయిన ప్రీతి పటేల్‌.. లిజ్‌ ట్రస్‌ హయాంలోనూ బ్రిటన్‌ హోం సెక్రటరీగా కొనసాగుతారని భావించారంతా. కానీ, లిజ్ ప్రధానిగా ఎన్నికైనా కొన్ని గంటలకే ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో ఈ పదవి ఇప్పుడు మరో భారతీయురాలు సుయేల్లాకు దక్కింది. దాంతో ఈ పదవి చేపడుతున్న రెండో భారత సంతతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 


భారతీయ మూలాలు (Indian Origin) కలిగిన బ్రావెర్మన్ యూకేలోని వెంబ్లేలో పుట్టిపెరిగారు. ఆమె తల్లి హిందూ తమిళియన్ ఉమా, తండ్రి గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండెజ్. అయితే, ఆమె తల్లి మారిషస్ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా రాజధాని నైరోబి నుంచి వలస వచ్చారు. ఈ దంపతులకు 1980లో బ్రావెర్మన్ జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి లా పట్టాపొందిన ఆమె.. బోరిస్ జాన్స్ హయాంలో అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన నేపథ్యం గురించి అందరికి తెలిసిందంటారు బ్రావెర్మన్. 


ఇక తనకు కీలక పదవి దక్కడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిక్సిట్ (Brexit) అవకాశాలను పొందుపరిచి, సమస్యలను చక్కదిద్దాలనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. యూరోపియన్ కోర్టు ఆఫ్ హ్యుమన్ రైట్స్ నుంచి బ్రిటన్‌ను బయటకు తీసుకువచ్చేలా ఐరోపా నుంచి స్పష్టమైన విరామాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె గతేడాది రెండో బిడ్డకు జన్మనిచ్చే నిమిత్తం ప్రసూతి సెలవుల్లో ఉన్న సమయంలోనే కేబినెట్ మంత్రిగా అనుమతించేలా ఒక చట్టపరమైన మార్పును తీసుకొచ్చి పేరుగాంచిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-07T16:25:09+05:30 IST