Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 24 Aug 2022 07:45:50 IST

Rishi Sunak: ‘కుర్సి నషీన్’ నుంచి రిషి సునాక్ దాకా

twitter-iconwatsapp-iconfb-icon
Rishi Sunak: కుర్సి నషీన్ నుంచి రిషి సునాక్ దాకా

నాలుగు శతాబ్దాల నాటి మాట. 1616 డిసెంబర్‌లో క్రిస్మస్ పండుగ రోజులు. ఆనందోత్సోహాలలో ఉన్న లండన్ నగర వాసులకు ఒక భారతీయ యువకుడు వింత ఆకర్షణగా నిలిచాడు. ఆబాల గోపాలం అతన్ని విచిత్రంగా చూశారు. విశేష ఆసక్తి చూపారు. ఆంగ్ల సైనికాధికారి ఒకరు ఆ భారతీయ యువకుడిని మత మార్పిడి లక్ష్యంతో మచిలీపట్నం నుంచి లండన్‌కు తీసుకువెళ్ళాడు. ఆ భారతీయ యువకుడి క్రైస్తవ ధర్మ స్వీకరణ కార్యక్రమంలో ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ కూడా పాల్గొన్నాడు. ఆ భారతీయుడికి ఆయనే పీటర్ పోప్‌గా నామకరణం చేశాడు. షేక్‌స్పియర్ చివరి నాటకాలలో ఒకటైన ‘ది టెంపెస్ట్’కు ఈ భారతీయుడి గాథే ఆధారమన్న వాదన ఒకటి ఉంది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించిన బ్రిటన్‌కు ఆనాటి నుంచి అసంఖ్యాక భారతీయులు జీవనోపాధుల, విద్యా వ్యాసంగాల, వ్యాపార వాణిజ్యాల నిమిత్తం వలస వెళ్ళారు. విశేషమేమిటంటే ఇంత కాలానికి భారత సంతతి వ్యక్తి ఒకరు బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీపడుతున్నారు. ఇదొక అసాధారణ విషయం. అంతేకాదు అత్యంత ఆసక్తికరం కూడా. కనుకనే బ్రిటన్ ప్రధానమంత్రి పదవి పోటీలో 42 ఏళ్ల రిషి సునాక్ (జననం 1980 మే 12) అంతిమంగా విజేత అవుతాడా కాడా అని ఒక్క భారతీయులే కాదు, యావత్ ప్రపంచ ప్రజలు ఉత్కంఠతో గమనిస్తున్నారు.


పాలకుల ముందు ప్రజలు చేతులు జోడించి నిలబడే విధానం రాచరిక పాలనలో ఉండేది. అందుకు ప్రపంచంలో ఏ రాజు, రాజ్యం మినహాయింపు కాదు. అయితే వ్యాపారులుగా వచ్చి, కుట్రలు కుహకాలతో సువిశాల భారతదేశాన్ని కైవసం చేసుకుని ఇంచుమించు రెండు శతాబ్దాల పాటు పాలించిన ఆంగ్లేయులు ఆ విధానాన్ని కుర్సి నషీన్ పేర అమలు చేసిన తీరు హేయమైనది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కుర్చీలో కూర్చోవడానికి అనుమతించే పత్రాన్ని కుర్సి నషీన్ అని అనేవారు. వలస పాలనా కాలంలో ఆ కుర్సి నషీన్ పత్రం దొరకడం అనేది లండన్ నుంచి బారిష్టర్ పట్టా పొందడమంత కష్టంగా ఉండేది. ఆ కుర్సి నషీన్ ఆనవాయితీ రోజుల నుంచి నేడు లండన్‌లో అధికార సింహాసనానికి పోటీపడడం దాకా భారతీయుల పురోగమన యాత్ర నిజంగా ఒక అద్భుతం.


భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత కూడ భారతీయులు పెద్ద సంఖ్యలో బ్రిటన్‌కు వలస వెళ్లారు. వారిలో గుజరాతీలు, పంజాబీలు అధిక సంఖ్యలో ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భారత సంతతి వారు బ్రిటన్‌కు వచ్చి స్ధిరపడ్డారు. ఈ రోజు బ్రిటన్ పౌరులుగా 15 లక్షల మంది భారత సంతతి వారు ఉన్నారు. ఈ భారతీయులు బ్రిటన్ సమాజంలో అనేక వివక్షలను అధిగమిస్తూ అన్ని రంగాలలో పురోగమిస్తున్నారు. 1892లో ఒక భారతీయుడు ప్రప్రథమంగా బిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. ఆ విజేత దాదాబాయి నౌరోజీ. ఆ తరువాత సైతం అనేక దశాబ్దాల పాటు భారతీయులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించారనేది ఒక కఠోర వాస్తవం. ఇప్పటికీ ఈ వివక్ష ఏదో ఒక రూపంలో కొంత వరకు కొనసాగుతుందనేది కూడ కొట్టివేయలేని వాస్తవమే.


గృహిణి బంగారు ఆభరణాలు విక్రయించి విమానం టిక్కెట్ కొనుక్కుని లండన్‌కు వచ్చిన ఒక ప్రవాస భారతీయ కుటుంబంలో రిషి సునాక్ జన్మించారు. పిన్న వయసులోనే ఆయన కన్జర్వేటివ్ పార్టీ పక్షాన ప్రధాన మంత్రి పదవికి ప్రధాన పోటీదారుడిగా ఎదిగిన వైనం మామూలు విషయం కాదు. సునాక్‌కు పూర్వం భారత సంతతి వారు పలువురు బ్రిటిష్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో రిషి సునాక్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ ప్రభుత్వం కూలిపోవడానికి ఒక విధంగా ఆర్ధిక మంత్రిగా రిషి సునాక్ అనుసరించిన విధానాలు, చేపట్టిన చర్యలే చాల వరకు కారణమనే భావన కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఉంది. ఆ కారణంగానే ప్రధానమంత్రి పదవీ పోటీలో ఆయన వెనుకబడ్డారనేది వాదన. అయినా జాత్యహంకారం ఎంతగా ఉన్నప్పటికీ ప్రతిభ ఆధారంగా తమ హక్కులను సాధించుకోవడానికి బ్రిటిష్, ఇతర పాశ్చాత్య దేశాలు జాతి, మతాలకు అతీతంగా తమ పౌరులు అందరికీ ఒక అవకాశం కల్పిస్తాయి.


వలసల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, పాశ్చాత్య దేశాల కంటే చాలా ముందే భారతదేశం తన గడ్డకు వచ్చిన వివిధ దేశాల విభిన్న వర్గాల వారిని అక్కున చేర్చుకొని ఆదరించి అందలాలు ఎక్కించింది. ఇటువంటి ఉదారత, విశాల భావం వర్తమాన భారతదేశంలో క్రమేణా మృగ్యమవుతుండడం మనస్సును కృంగదీస్తుంది. పరాయి వారిని సైతం ఆంగ్లేయులు, ఇతర పాశ్చాత్యులు తమవారిగా చేసుకుని, అందలం ఎక్కిస్తుండగా మనం మాత్రం ‘వారు’, ‘మనం’ అనే సంకుచిత భావనతో వ్యవహరిస్తున్నాం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.