సింగపూర్‌లో భారత సంతతి పోలీస్ ఆఫీసర్‌కు రెండేళ్ల జైలు !

ABN , First Publish Date - 2020-09-25T16:12:12+05:30 IST

అవినీతి, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతి పోలీస్ ఆఫీసర్‌కు సింగపూర్ న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

సింగపూర్‌లో భారత సంతతి పోలీస్ ఆఫీసర్‌కు రెండేళ్ల జైలు !

సింగపూర్ సిటీ: అవినీతి, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతి పోలీస్ ఆఫీసర్‌కు సింగపూర్ న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే... సింగపూర్ పోలీస్ ఫోర్స్‌లో పనిచేస్తున్న మహేంద్రన్ సెల్వరాజు అనే భారత సంతతి అధికారిని గతేడాది మే 1న ది కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మహిళపై తప్పుడు కేసు పెట్టి ఆమెను లైంగిక వేధింపులకు పాల్పడినందుకు మహేంద్రన్‌ను అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.


మహిళ పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం ఆమెపై దొంగతనం కేసు పెట్టిందని అబద్దం చెప్పి దర్యాప్తు పేరుతో ఆమెను కలిశాడు. అనంతరం తన కోరిక తీరిస్తే ఈ కేసు నుంచి బయటపడేస్తానని, లేనిపక్షంలో నీ ఉద్యోగం పోవడంతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఆమెను బెదిరించాడు. ఇలాగే దర్యాప్తు పేరిట మరో మహిళపై కూడా మహేంద్రన్ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై రెండు అవినీతి, రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో మహేంద్రన్ దోషిగా తేలడంతో న్యాయస్థానం అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

Updated Date - 2020-09-25T16:12:12+05:30 IST