విదేశీ కార్మికులను తిరిగి పంపిస్తున్న భారత సంతతి ముస్తఫా సెంటర్..

ABN , First Publish Date - 2020-09-01T21:13:02+05:30 IST

సింగపూర్‌లోని అతిపెద్ద భారతీయ మూలాలు ఉన్న హైపర్‌మార్కెట్ ముస్తఫా సెంటర్ సోమవారం తమ వద్ద పనిచేసే విదేశీ కార్మికులను తిరిగి ఇంటికి పంపిస్తున్నట్లు పేర్కొంది.

విదేశీ కార్మికులను తిరిగి పంపిస్తున్న భారత సంతతి ముస్తఫా సెంటర్..

సింగపూర్ సిటీ: సింగపూర్‌లోని అతిపెద్ద భారతీయ మూలాలు ఉన్న హైపర్‌మార్కెట్ ముస్తఫా సెంటర్ సోమవారం తమ వద్ద పనిచేసే విదేశీ కార్మికులను తిరిగి ఇంటికి పంపిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో అధికంగా భారతీయులు ఉన్నట్లు తెలిపింది. వర్క్ పాసుల గడువు ముగిసిన కార్మికులను ఇంటికి తిరిగి పంపిస్తున్నామని చెప్పిన సంస్థ... కోవిడ్-19 మహమ్మారి కారణంగా వ్యాపారం తీవ్రంగా దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. నెలవారిగా ఇచ్చే 300 సింగపూర్ డాలర్లు(రూ.16వేలు) ‘జీవనోపాధి భత్యం’ పనికి పిలవని ఉద్యోగులకు చెల్లించడాన్ని కూడా కంపెనీ నిలిపివేస్తుంది తెలియజేసింది.


ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ... సంస్థ తన విదేశీ కార్మికుల వర్క్ పాస్‌లను పునరుద్ధరించలేకపోయిందని, ఈ విదేశీ కార్మికులకు టోకెన్‌గా ఒక నెల బేసిక్ సాలరీ మాత్రమే ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం తమను తీవ్రంగా బాధించిన ప్రస్తుత కరోనా సంక్షోభం వేళ తప్పడం లేదన్నారు. వీలైనంత త్వరగా వ్యాపారాలు సాధారణ స్థితికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇక లిటిల్ ఇండియాగా పిలువబడే ప్రాంతంలోని సయ్యద్ అల్వి రోడ్డులో ఉండే ముస్తఫా సెంటర్ ఆరు అంతస్తుల భవనంలో ఉంటుంది. భారత్ నుంచి వెళ్లే సందర్శకులు తప్పనిసరిగా ఈ సెంటర్‌ను విజిట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు ఇక్కడ ఎంతో ఫేమస్ అని టాక్. కాగా, కరోనా కారణంగా ఈ మాల్ ఏప్రిల్ 2 నుంచి పూర్తిగా మూత పడింది. విదేశీ వర్కర్లు ఉండే వసతి గృహాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో ఈ వ్యాపార సముదాయాన్ని మూసివేయాల్సి వచ్చింది. అయితే, 24 గంటలు పనిచేసే ఈ సెంటర్ తన వ్యాపార వేళలను తగ్గించుకుని మే 6 నుంచి మళ్లీ ఓపెన్ అయింది. ఇప్పుడు కేవలం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పని చేస్తోంది. ఇలా పని వేళలు తగ్గడంతో పాటు కొవిడ్ వల్ల సందర్శకుల తాకిడి కూడా తగ్గడంతో కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి దాపురించింది. అందుకే వర్క్ పాసుల గడువు ముగిసిన విదేశీ కార్మికులను తిరిగి ఇంటికి పంపిస్తోంది ముస్తఫా సెంటర్ యాజమాన్యం. 


Updated Date - 2020-09-01T21:13:02+05:30 IST