నుదుట నామాలు ధరించేందుకు అనుమతించిన అమెరికా ఎయిర్‌ఫోర్స్ ! ఫలించిన భారతీయ సంతతి వ్యక్తి ప్రయత్నం!

ABN , First Publish Date - 2022-03-23T01:47:25+05:30 IST

: విధుల్లో ఉండగా తన మత సంప్రదాయాన్ని పాటించేందుకు అనుమతించాలంటూ రెండేళ్ల పాటు అమెరికాలోని ఓ భారతీయ సంతతి వ్యక్తి చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది.

నుదుట నామాలు ధరించేందుకు అనుమతించిన అమెరికా ఎయిర్‌ఫోర్స్ !  ఫలించిన భారతీయ సంతతి వ్యక్తి ప్రయత్నం!

ఎన్నారై డెస్క్: విధుల్లో ఉండగా తన మత సంప్రదాయాన్ని పాటించేందుకు అనుమతించాలంటూ రెండేళ్ల పాటు అమెరికాలోని ఓ భారతీయ సంతతి వ్యక్తి చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ఎయిర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న దర్శన్ షాకు విధుల్లో ఉండగా నామాలు ధరించేందుకు మతపరమైన మినహాయింపు ఇస్తున్నట్టు  అమెరికా వాయుసేన ఇటీవల ప్రకటించింది. ఎయిరోస్పేస్ మెడికల్ టెక్నీషియన్‌ అయిన దర్శన్..  అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లోని 90వ ఆపరేషనల్ మెడికల్ రెడీనెస్ స్క్వాడ్రన్‌లో సభ్యుడు. 


కాగా.. నామాలు పెట్టుకునేందుకు అనుమతి లభించడంపై  దర్శన్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఏ మతవిశ్వాసాల్ని అయినా స్వేచ్ఛగా ఆచరించగలిగే అవకాశం ఉన్న దేశంలో మనం జీవిస్తున్నాం. అందుకే అమెరికా ఓ గొప్ప దేశంగా కీర్తి పొందుంతోంది. నమ్మకాలు, మత విశ్వాల కారణంగా ఇక్కడ ఏ వ్యక్తి వివక్ష ఎదుర్కోరు. అమెరికాలోని తొలి అమెండ్‌మెంటే లేకపోతే నాకు ఇదంతా సాధ్యమయ్యేది కాదు. మిలిటరీ వ్యక్తిగా, ఈ దేశ పౌరుడిగా ఉంటూ కూడా నాదైన అస్తిత్వాన్ని చాటుకునే అవకాశం ఉండేది కాదు’’ అని దర్శన్ పేర్కొన్నారు. 


గుజరాతీ మూలాలున్న దర్శన్.. మిన్నెసోటా రాష్ట్రంలోని ఈడెన్ ప్రెయిరీలో జన్మించారు. శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ సంప్రదాయాలను దర్శన్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. సంస్థ సంప్రదాయాలు పాటించేవారు.. నుదుటిపై బొట్టు పెట్టుకుని దాని చుట్టూ ఆంగ్ల అక్షరం ‘యూ’ ఆకారంలో తిలకం ధరించాల్సి ఉంటుంది. అయితే.. 2020లో తన మిలిటరీ ట్రైనింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఈ తిలకం ధరించేందుకు అనుమతించాలంటూ దర్శన్ తన పైఅధికారులకు విజ్ఞప్తి చేస్తూ రాగా.. ఇన్నాళ్లకు అనుమతి లభించింది. ‘‘విధుల్లో ఉన్నా కూడా కొన్ని మతపరమైన సంప్రదాయాలను పాటించడాన్ని కొందరు వ్యక్తిగత బాధ్యతగా భావిస్తారు. అయితే.. ఇవి ఆర్మీ యూనిఫాం నిబంధనలకు విరుద్ధంగా ఉండే అవకాశం కూడా ఉంది. దీంతో.. మతపరమైన మినహాయింపును కోరాను’’ అని దర్శన్ తెలిపారు. సుదీర్ఘకాలం పాటూ ఎయిర్‌ఫోర్స్‌లో కొనసాగాలనుకుంటున్న దర్శన్.. తన చదువు పూర్తయ్యాక డాక్టర్‌గా సేవలందించడమే తన లక్ష్యమని తెలిపారు. 


ఏమిటీ ఫస్ట్ అమెండ్‌మెంట్.. 

అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ ప్రకారం.. మతపరమైన అంశాల్ని నియంత్రించేలా, మతస్వేఛ్ఛను అడ్డుకునేలా అమెరికా ప్రభుత్వం ఎలాంటి చట్టాలు, రూపొందించగూడదు. అంతేకాకుండా.. భావవ్యక్తీకరణ, పత్రికాస్వేచ్ఛ,  సమావేశాల ఏర్పాటుకు పరిమితులు విధించేలా ఎటువంటి నిబంధనలూ అమలు చేయకూడదు.

Updated Date - 2022-03-23T01:47:25+05:30 IST