బీచ్‌లో దొరికిన వెడ్డింగ్ రింగ్‌ను.. భారత సంతతి బాలిక ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-09-29T20:03:31+05:30 IST

బ్రిటన్‌లో సరదాగా బీచ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ రింగ్ పొగొట్టుకున్నాడు.

బీచ్‌లో దొరికిన వెడ్డింగ్ రింగ్‌ను.. భారత సంతతి బాలిక ఏం చేసిందంటే..

లండన్: బ్రిటన్‌లో సరదాగా బీచ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ రింగ్ పొగొట్టుకున్నాడు. దాని కోసం ఎంత వెతికిన దొరకకపోవడంతో నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత అదే బీచ్‌కు వెళ్లిన 11 ఏళ్ల భారత సంతతి బాలికకు ఆ ఉంగరం దొరికింది. దాంతో ఆ రింగ్‌ను తన తల్లి, బీచ్‌లో ఉండే ఓ కేఫ్ యజమాని సహాయంతో దానిని పొగొట్టుకున్న వ్యక్తికి చేర్చింది భారత బాలిక. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 


వివరాల్లోకి వెళితే... గత నెలలో ప్రియా సాహు అనే భారత సంతతి బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లాండ్‌‌లోని వెంట్నోర్ బీచ్‌కు వెళ్లింది. సరదాగా ఇసుకలో ఆడుకుంటున్న ప్రియాకు బంగారం వెడ్డింగ్ రింగ్ దొరికింది. ఆ విషయాన్ని తన తల్లి అశ్వితాతో చెప్పింది ప్రియా. అలాగే ఆ ఉంగరాన్ని ఎలాగైనా దానిని పొగొట్టుకున్న వ్యక్తికి చేర్చాలని ప్రియా తన తల్లితో చెప్పింది. 


ఇక ఉంగరం పొగొట్టుకున్న మాట్ ఈస్ట్లీ దాని కోసం బీచ్ మొత్తం కలియతిరుగుతూ వెతికాడు. కొన్ని రోజుల పాటు ఉంగరం కోసం మాట్ ప్రతిరోజు బీచ్‌కు వెళ్లి గంటల తరబడి వెతికేవాడు. కానీ ఉంగరం ఎంతకు దొరకకపోవడంతో దానిపై ఆశలు వదులుకున్నాడు. చివరగా బీచ్ నుంచి తిరిగి వెళ్తూ తన ఉంగరం పోయిన విషయాన్ని అక్కడ ఉండే ఓ కేఫ్ యజమానికి చెప్పాడు. ఎవరికైనా రింగ్ దొరికి.. వారు అడిగితే తనకు సమాచారం ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  


ఈ క్రమంలో తనకు దొరికిన వెడ్డింగ్ రింగ్‌ను ప్రియా తన తల్లి అశ్వితా సహాయంతో కేఫ్ యజమాని వద్దకు తీసుకెళ్లింది. దాంతో కేఫ్ యజమాని మాట్‌ గురించి వారికి చెప్పాడు. దీంతో ప్రియా, ఆమె తల్లి అశ్వితా ఇద్దరు మాట్‌తో మాట్లాడారు. అనంతరం ఆ ఉంగరం కేఫ్ యజమానికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎప్పటికీ దొరకదు అనుకున్న వెడ్డింగ్ రింగ్ తిరిగి తన చేతికి రావడంతో మాట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉంగరాన్ని తిరిగి తనకు చేర్చిన ప్రియా, ఆమె తల్లి అశ్వితాకు మాట్ ధన్యవాదాలు తెలియజేశాడు.  


Updated Date - 2020-09-29T20:03:31+05:30 IST