పనిమనిషిపై వేధింపులు.. సింగపూర్‌లో భారతీయురాలికి జైలు!

ABN , First Publish Date - 2021-04-15T14:58:06+05:30 IST

భారత సంతతి మహిళ, సింగపూర్‌లోని చాంగీ జైలు మాజీ కౌన్సిలర్‌కు పనిమనిషిపై వేధింపులకు పాల్పడిన కేసులో బుధవారం సింగపూర్ న్యాయస్థానం ఏడు నెలల జైలు శిక్ష విధించింది.

పనిమనిషిపై వేధింపులు.. సింగపూర్‌లో భారతీయురాలికి జైలు!

సింగపూర్ సిటీ: భారత సంతతి మహిళ, సింగపూర్‌లోని చాంగీ జైలు మాజీ కౌన్సిలర్‌కు పనిమనిషిపై వేధింపులకు పాల్పడిన కేసులో బుధవారం సింగపూర్ న్యాయస్థానం ఏడు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... గాయత్రి అయ్యర్ అనే భారత సంతతి మహిళ వద్ద 2017లో మయన్మార్‌కు చెందిన థాంగ్ ఖా లామ్(30) పనిమనిషిగా చేరింది. కొన్ని రోజులుగా పనిమనిషిని బాగానే చూసుకున్న గాయత్రి ఆ తర్వాత తనలోని వికృత చేష్టలను బయటపెట్టింది. ఓ రోజు తనను 'మా' అని పిలిచిందని థాంగ్‌పై చేయిచేసుకుంది గాయత్రి. తీవ్రంగా కొట్టడంతో ఆమె భుజానికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఓ రోజు ఉదయాన్నే తన కుమారుడిని ఎందుకు నిద్రలేపలేదనే కారణంతో పనిమనిషిపై మరోసారి చేయిచేసుకుంది. ఆమె రెండు చెవులపై గట్టిగా కొట్టింది. దీంతో థాంగ్ ఎడమ చెవికి తీవ్రంగా గాయమైంది.


ఆ రోజంతా ఆమెకు రెండు చెవులు వినిపించలేదట. ఇలా రోజురోజుకూ గాయత్రి వేధింపులు ఎక్కువ కావడంతో థాంగ్ భరించలేకపోయింది. దాంతో ఈ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత గాయత్రి ఇంటి నుంచి థాంగ్ ఎలాగోలా తప్పించుకుంది. అనంతరం గాయత్రి వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు వచ్చింది. దాంతో సింగపూర్ న్యాయస్థానం గాయత్రిని దోషిగా తేల్చింది. బుధవారం ఆమెకు శిక్షను ఖరారు చేసింది. దోషిగా తేలిన గాయత్రికి ఏడు నెలల జైలు శిక్ష, బాధితురాలికి 5,330 సింగపూర్ డాలర్లు(రూ.2.99 లక్షలు) పరిహారంగా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.        

Updated Date - 2021-04-15T14:58:06+05:30 IST