ప్రముఖ భారత సంతతి కమెడియన్‌పై లండన్‌లో దాడి..!

ABN , First Publish Date - 2022-07-18T01:43:19+05:30 IST

బ్రిటన్‌లోని ప్రముఖ భారత సంతతి కమెడియన్‌ పాల్ చౌదరిపై(Paul Chowdhry) దాడి జరిగింది.

ప్రముఖ భారత సంతతి కమెడియన్‌పై లండన్‌లో దాడి..!

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లోని(Britain) ప్రముఖ భారత సంతతి కమెడియన్‌ పాల్ చౌదరిపై(Paul Chowdhry) దాడి జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నీపై దాడి జరగడం మేం చూశాం’ అంటూ కొందరు స్నేహితులు ఆయనకు పంపిన సందేశాలను షేర్ చేశారు. తనపై దాడి జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. శుక్రవారం నాడు లండన్‌లోని న్యూ ఆక్స్‌ఫర్డ్ రోడ్డులో తాను కారులో ఉండగా దాడి జరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తానని చెప్పారు. లండన్‌లో పుట్టిన పెరిగిన పాల్ అసలు పేరు తేజ్‌పాల్ సింగ్ చౌదరి. మరోవైపు.. దాడి విషయం తెలుసుకున్న పాల్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందించారు. ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టు కామెంట్లు పెట్టారు. 


కాగా.. పాల్‌పై గతంలోనూ విద్వేషపూరిత దాడులు జరిగాయి. 1980ల్లో తన తండ్రి కూడా వివక్ష ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. విద్వేషపూరిత దాడులు జరిగాయని చెప్పారు. తన తండ్రిపై కత్తితో దాడి జరిగినట్టు ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ‘‘మా నాన్నఈ విషయాన్ని అప్పుడే మర్చిపోయారు. నిందితులు మాత్రం ఇప్పటికీ పట్టుబడలేదు’’ అని చెప్పారు. తాను కూడా ఇటువంటి విద్వేషపూరిత దాడులకు గురయ్యాయని చెప్పారు. పాల్‌ 1998లో కమెడియన్‌గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టాండప్ ఫర్ ది వీక్ అనే కామెడీషోలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2003లో ట్రినిడాడ్‌లో జరిగిన కరీబియన్ కామెడీ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చిన తొలి బ్రిటీష్ వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 

Updated Date - 2022-07-18T01:43:19+05:30 IST