భారత్‌కు అత్యాధునిక హెలికాఫ్టర్లు! రూ.18 వేల కోట్ల భారీ డీల్!

ABN , First Publish Date - 2021-07-17T21:38:43+05:30 IST

లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన రెండు అత్యాధునిక సిరోస్కీ ఎమ్‌హెచ్-60ఆర్ బహుళ ప్రయోజన మారీటైమ్ హెలికాఫ్టర్లను అమెరికా నావికాదళం తాజాగా భారత్‌కు అప్పగించింది.

భారత్‌కు అత్యాధునిక హెలికాఫ్టర్లు! రూ.18 వేల కోట్ల భారీ డీల్!

శాన్‌డియేగో(అమెరికా): లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన రెండు అత్యాధునిక సిరోస్కీ ఎమ్‌హెచ్-60ఆర్ బహుళ ప్రయోజన మారీటైమ్ హెలికాఫ్టర్లను అమెరికా నావికాదళం తాజాగా భారత్‌కు అప్పగించింది. శుక్రవారం శాన్‌డియేగో‌లోని నార్త్ ఐలాండ్‌లోగల నావికాదళ స్థావరంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా అధికారులు ఈ హెలికాఫ్టర్లను అధికారికంగా భారత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా నేవల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ వైస్ అడ్మిరల్ కెన్నెత్ వైట్‌సెల్, భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ రవ్‌నీత్ సింగ్, అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ, లాక్‌హీడ్ మార్టిన్ అధికారులు పాల్గొన్నారు.


మొత్తం 24 సిరోస్కీ హెలికాఫ్టర్ల కోసం భారత నావికాదళం అమెరికా ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 2.4 బిలియన్ డాలర్లు. భారత్ కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు రూ. 17.9 వేల కోట్లకు సమానం. కాగా.. భారత్, అమెరికాల రక్షణ భాగస్వామ్యంలో ఈ ఒప్పందం ఓ  కీలకమైన మైలురాయి అని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల రక్షణ రంగాల భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన ట్వీట్ చేశారు.  గత రెండేళ్లలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం 20 బిలియన్ డాలర్లకు చేరుకుందని తరణ్‌జీత్ సింగ్ పేర్కొన్నారు.  


అన్ని వాతావరణాల్లో పనిచేయగలిగిన బహుళ ప్రయోజనకర సిరోస్కీ హెలికాఫ్టర్లు ద్వారా భారత నావికాదళం మరింత పఠిష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హెలికాఫ్టర్లు సుముద్రపు ఉపరితలంపైనున్న లక్ష్యాలనే కాకుండా, జలాంతర్గాములను కూడా ధ్వంసం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆయుధాల సరఫరా, గాలింపు చర్యల్లో కూడా ఈ హెలికాఫ్టర్లు బాగా ఉపయోగపడతాయి. భారత సిబ్బందికి చెందిన తొలి బ్యాచ్.. ఈ హెలికాఫ్టర్లపై అమెరికాలో ప్రస్తుతం శిక్షణ పొందుతోందని రక్షణ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-07-17T21:38:43+05:30 IST