యుద్ధ నౌకపై చైనా మాటలతో ఆశ్చర్యపోతున్న భారత నావికా దళం అడ్మిరల్స్

ABN , First Publish Date - 2022-06-27T17:28:09+05:30 IST

ఇండో-పసిఫిక్‌లో అమెరికా సైనిక శక్తిని తిప్పికొట్టే సత్తా

యుద్ధ నౌకపై చైనా మాటలతో ఆశ్చర్యపోతున్న భారత నావికా దళం అడ్మిరల్స్

న్యూఢిల్లీ : ఇండో-పసిఫిక్‌లో అమెరికా సైనిక శక్తిని తిప్పికొట్టే సత్తా తమ  యుద్ధ నౌక ఫుజియాన్‌కు ఉందని చైనా చెప్తుండటాన్ని భారత నావికా దళం అడ్మిరల్స్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే జియాంగ్నన్ షిప్‌యార్డులో జలప్రవేశం చేసిన  ఈ నౌక గురించి చైనా చెప్తున్న మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా ఈ విషయంలో ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే, చైనా ఈ నౌకను ఏ విధంగా నిర్వహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. 


భారత దేశ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య జూన్ 25న ఐఎన్ఎస్ కర్వార్ నుంచి బయటకు వచ్చింది. అక్కడ 18 నెలలపాటు ప్రధాన మరమ్మతులు జరిగిన తర్వాత స్టీమ్ టర్బయిన్ ఇంజిన్లను ఫైర్ చేసి, పోర్ట్ యాంకరేజ్‌కు వెళ్లింది. మిగ్-29కే ఫైటర్ విమానాలను ఈ కదిలే నౌకపైకి పంపించడానికి ముందు, ఈ నౌక సముద్రంలో కొన్ని పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. మరో విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొచ్చిన్ హార్బర్‌లో జలప్రవేశం చేయిస్తారు. 


చైనీస్ మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్‌ను జియాంగ్నన్ షిప్‌యార్డులో జూన్ 17న జల ప్రవేశం చేయించారు.  కొద్ది రోజుల తర్వాత ఐఎన్ఎస్ విక్రమాదిత్య రీఫిటింగ్ చేయించుకుని తిరిగి వచ్చింది. దీనిని ఫిటింగ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. అయితే ఫుజియాన్ సత్తాపై చైనా చెప్తున్న మాటలను భారత నావికా దళం అడ్మిరల్స్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. స్టీమ్ పవర్డ్ 80,000 టన్నుల విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్ అమెరికాకు చెందిన అణు సామర్థ్యంగల 1,00,000 టన్నుల యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సూపర్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కు ప్రత్యర్థి అని చైనా చెప్తుండటం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు. ఈ అమెరికా యుద్ధ నౌక 2017 నుంచి అందుబాటులోకి వచ్చింది. 


ఇండో-పసిఫిక్‌లో రానున్న దశాబ్దంలో అమెరికా సైనిక శక్తిని ఫుజియాన్ దీటుగా ఎదుర్కొంటుందని చైనా చెప్తుండటం ఆశ్చర్యంగా ఉందని ఇండియన్ నేవీ అడ్మిరల్స్ చెప్తున్నారు. ఫుజియాన్‌కు అత్యాధునిక ఎలక్ట్రోమేగ్నటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ (EMALS), అడ్వాన్స్‌డ్ అరెస్టింగ్ గేర్ (AAG) టెక్నాలజీలను అమర్చినట్లు చైనా చెప్తోందని, ఇప్పటి వరకు యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్‌కు మాత్రమే ఈ ఆధునిక టెక్నాలజీని అమర్చారని గుర్తు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఈ యుద్ధ నౌక నుంచి యుద్ధ విమానాలు వేగంగా బయల్దేరడానికి, దిగడానికి వీలవుతుందని చెప్తున్నారు. 


స్టీమ్ పవర్‌తో EMALSను ఏ విధంగా ఆపరేట్ చేస్తారో చెప్పాలని చైనాను ప్రశ్నిస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా తన యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్‌కు అమర్చిన ఈ టెక్నాలజీతో చాలా ఇబ్బందులు పడుతోందని గుర్తు చేస్తున్నారు. అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ (DOD) నివేదికల ప్రకారం, ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించడం వల్ల తరచూ బ్రేక్‌డౌన్లు అవుతున్నాయని, ఇది నమ్మదగినది కాదని తెలుస్తోందని చెప్తున్నారు. 


ఈ సందర్భంగా గుర్తించవలసిన విషయం ఏమిటంటే, యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అణు సామర్థ్యంగలది. ఫుజియాన్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య స్టీమ్ పవర్డ్ యుద్ధ నౌకలు. ఫుజియాన్‌కు ఎనర్జీ రిజర్వు ఎక్కువగా ఉంది. 


జబ్బలు చరుస్తున్న పాకిస్థాన్

చైనాకు మూడు విమాన వాహక యుద్ద నౌకలు ఉన్నాయంటూ పాకిస్థాన్ వంటి చైనా మిత్ర దేశాలు జబ్బలు చరుస్తున్నాయి. అయితే వందేళ్ళ అనుభవంగల అమెరికా నావికా దళం యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్‌కు అమర్చిన కొత్త టెక్నాలజీలతో ఇబ్బందులు పడుతోంది. భారత దేశం 1961 నుంచి విమాన వాహక యుద్ధ నౌకలను ఉపయోగిస్తోంది. కానీ చైనా కేవలం 2012లో మాత్రమే విమాన వాహక యుద్ధ నౌక కార్యకలాపాలను ప్రారంభించింది. యుద్ధ విమానాలు భూమిపైన ఉండే వైమానిక స్థావరాల నుంచి బయల్దేరడం కన్నా నావికా దళ విమానయానం చేయాలంటే చాలా నైపుణ్యం ఉండాలి. క్రింద సముద్రంలో నీళ్లు, పైన ఆకాశం వల్ల పైలట్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒడుదొడుకుల్లో విమాన వాహక యుద్ధ నౌకలో యుద్ధ విమానాలను దించడానికి అత్యున్నత స్థాయి నైపుణ్యం తప్పనిసరి. 


సరికొత్త యుద్ధ క్షేత్రంలో భారత్ పాత్ర

చైనా, అమెరికా వేగంగా రంగంలోకి దిగుతుండటంతో ఇండో-పసిఫిక్ ప్రాంతం సరికొత్త యుద్ధ క్షేత్రం కాబోతోంది. జపాన్ నావికా దళం రైడా సముద్ర సంబంధ సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఫుజియాన్ వంటి యుద్ధ నౌకలకు అమెరికా నావికా దళం కఠిన పరీక్షలు పెడుతుంది. ఈ పరిస్థితుల్లో హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రాలలో భారత నావికా దళం కూడా తన వంతు పాత్రను పోషించేందుకు సిద్ధమవాలి. చైనా వ్యవహార శైలిని క్వాడ్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) దేశాల నావికా దళాలు నిశితంగా గమనిస్తున్నాయి. 


Updated Date - 2022-06-27T17:28:09+05:30 IST