సింగపూర్‌లో భారత వ్యక్తికి జైలు.. చేసిన నేరమిదే!

ABN , First Publish Date - 2021-07-08T19:49:57+05:30 IST

పనిచేసే చోట నిర్లక్ష్యంగా వ్యవహరించి తోటి కార్మికుడి రెండు కాళ్లు పోవడానికి కారణమైన భారత వ్యక్తికి సింగపూర్ కోర్టు మంగళవారం రెండు వారాల జైలు శిక్ష విధించింది.

సింగపూర్‌లో భారత వ్యక్తికి జైలు.. చేసిన నేరమిదే!

సింగపూర్ సిటీ: పనిచేసే చోట నిర్లక్ష్యంగా వ్యవహరించి తోటి కార్మికుడి రెండు కాళ్లు పోవడానికి కారణమైన భారత వ్యక్తికి సింగపూర్ కోర్టు మంగళవారం రెండు వారాల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. పెరియసామీ వివేక్ అనే భారతీయుడు తాను పనిచేసే తువాస్ సౌత్ బౌలేవార్డ్‌లోని సైట్ వద్ద గతేడాది మార్చి 23న నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఫోర్క్‌లిఫ్ట్ వాహనంలో సుమారు 5వేల కిలోల బరువు గల కాంక్రీట్ బ్లాక్స్‌ను నింపిన పెరియసామీ దాన్ని సైట్‌లో ఒక చోట నిలిపాడు. వెంటనే వచ్చి వాహనాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఆన్‌లోనే ఉంచి, దాని చక్రాల కింద చిన్న రాయిలాంటి వస్తువును అడ్డు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


అయితే, ఫోర్క్‌లిఫ్ట్‌లో బరువు ఎక్కువ కావడంతో అది ముందుకు దూసుకొచ్చింది. అదే సమయంలో దాని ముందు వెనుకవైపు తిరిగి పని చేసుకుంటున్న కార్మికుడు సెవుగపెరుమల్ బాలమురగన్‌పై ఫోర్క్‌లిఫ్ట్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలమురగన్‌ను తెంగ్ ఫాంగ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నట్లు ప్రకటించారు. అనంతరం బాలమురగన్‌ను నేషనల్ యూనివర్శిటీ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు దెబ్బతిన్న అతడి రెండు కాళ్లను తొలగించారు. తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో పెరియసామీ నిర్లక్ష్యపూరిత ధోరణి వల్లే ప్రమాదం జరిగిందని తేల్చిన న్యాయస్థానం అతడికి రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.   

Updated Date - 2021-07-08T19:49:57+05:30 IST